ఖురాన్‌‌‌‌‌‌‌‌ను అపవిత్రం చేశాడంటూ టూరిస్టు హత్య

  •  పాకిస్తాన్​లో ఓ వ్యక్తిని షూట్ ​చేసి, ఈడ్చుకెళ్లి ఉరి

పెషావర్: ఖురాన్‌‌‌‌‌‌‌‌ను అపవిత్రం చేశాడంటూ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని ఒక పర్యాటకుడిని తుపాకీతో కాల్చి చంపి, రోడ్లమీద ఈడ్చుకెళ్లి బహిరంగంగా ఉరితీశారు. పాకిస్తాన్​లోని పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌ సియాల్‌‌‌‌‌‌‌‌కోట్​కు చెందిన ముహమ్మద్ ఇస్మాయిల్ ఆ దేశంలో టూరిస్ట్ ప్లేస్ అయిన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లోని స్వాత్ లోయకు పర్యటనకు వెళ్లాడు. గురువారం స్వాత్ జిల్లాలోని మద్యన్ ఏరియాలో అతను ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్​లో పేజీలను చింపి తగులబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.

 ఈ నేపథ్యంలో ఇస్మాయిల్​ను అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించినట్లు స్వాత్ జిల్లా పోలీసు అధికారి జహిదుల్లా చెప్పారు. ఖురాన్​ను అవమానించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని మసీదులు, మార్కెట్లలో లౌడ్​స్పీకర్ల ద్వారా ప్రకటించారు. దీంతో వేలమంది పోలీస్​స్టేషన్​ను చుట్టుముట్టారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్టేషన్​పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. 

దీంతో ఎమిమిది మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ఉన్న గుంపును పోలీసులు నిలవరించలేకపోయారు. వారు పోలీసులను తీవ్రంగా కొట్టి ఇస్మాయిల్​ను లాక్కెళ్లారు. అందరూ చూస్తుండగా కాల్చి చంపి.. మృతదేహాన్ని పట్టణంలోని అన్ని రోడ్లలో లాక్కెళ్లి ఒక చౌరస్తాలో ఉరి వేశారు.