డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ స్టార్ట్ అవుతుందా..? అంటే కాదనే సమాధానం చెబుతారు. కానీ, ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ స్టార్ట్ అయ్యింది. అవును ఇది నిజమే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. డ్రైవర్ లేకుండా నిలిపి ఉన్న ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి.. ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది.
బిజ్నోర్ లోని ఓ బూట్ల షాపు ముందు ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. షాపు లోపల సిబ్బంది ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి షాపు బయట పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దానంతట అదే స్టార్ట్ అయింది. అది ఆన్ అయినప్పుడు గేర్‌లో ఉండటంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. షాపు మెట్లు అడ్డం వచ్చినా అవేవి దాన్ని ఆపలేకపోయాయి.
షాపు మెట్లపై నుంచి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. దీంతో అద్దాలు పగిలిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో షాపులోని వాళ్లు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ట్రాక్టర్ షాపులోకి ఆటోమెటిక్ గా వచ్చిందని గుర్తించారు. షాపులోని సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లి బ్రేక్ వేసి.. ట్రాక్టర్ ను ఆపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
షూ షాపులోకి ట్రాక్టర్ రావడం వల్ల అద్దాలు పగిలిపోవడంతో యజమానికి భారీ నష్టం కలిగింది. తనకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ట్రాక్టర్ యజమాని కిషన్ కుమార్ పై షాపు ఓనర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.