టీచర్కు హోం వర్క్ చూపించేందుకు వెళుతుండగా 8 ఏళ్ల పాపకు హార్ట్ అటాక్.. స్పాట్ డెడ్..

టీచర్కు హోం వర్క్ చూపించేందుకు వెళుతుండగా 8 ఏళ్ల పాపకు హార్ట్ అటాక్.. స్పాట్ డెడ్..

బెంగళూరు: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. రోజూలానే స్కూల్కు వెళ్లిన ఎనిమిదేళ్ల పాప గుండెపోటుతో కుప్పకూలిపోయి స్కూల్ క్యాంపస్లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన చామరాజనగర్లో వెలుగుచూసింది. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తేజస్విని అనే ఎనిమిదేళ్ల వయసున్న పాప చామరాజనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. 

మంగళవారం (జనవరి 7, 2025) రోజూలానే స్కూల్కు పిల్లలతో కలిసి వెళ్లింది. తల్లిదండ్రులు దగ్గరుండి పాపను స్కూల్ బస్సు ఎక్కించారు. మమ్మీడాడీకి Bye చెప్పి పాప స్కూల్కు వెళ్లింది. కానీ.. అదే తమ బిడ్డ చివరిగా తమకు చెప్పిన Good Bye అని పాప తల్లిదండ్రులకు మాత్రం తెలియదుగా పాపం. టీచర్ హోం వర్క్ చూపించమని పాపను అడిగింది.

హోం వర్క్ చేసిన బుక్ టీచర్కు చూపించేందుకు మంగళవారం (జనవరి 7, 2025) ఉదయం 11.30 గంటల సమయంలో పాప టీచర్ దగ్గరకు వెళుతున్న క్రమంలో పాప కుప్పకూలిపడిపోయింది. సపోర్ట్ కోసం గోడ పట్టుకున్న కాసేపటికే పాప స్పృహ కోల్పోయినట్లు స్కూల్ టీచర్ గ్రహించింది. హుటాహుటిన పాపను ఆ టీచర్ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

గుండెపోటు కారణంగా పాప మరణించిందని వైద్యులు తేల్చారు. ఈ దుర్ఘటనతో స్కూల్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పాప తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించింది. విషయం తెలిసి పాప మమ్మీడాడీ షాక్కు లోనయ్యారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ ప్రభాకరన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఉదయం స్కూల్కు వచ్చినప్పుడు కూడా పాప ఆరోగ్యంగానే ఉందని, అలాంటి తేజస్విని ఇలా చనిపోవడం విస్మయానికి గురిచేసిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె పనితీరును అకస్మాత్తుగా కోల్పోవడం. గుండె ఎలక్ట్రికల్ సర్క్యూట్ సరిగ్గా పని చేయనప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమయంలో ఈ అసహజ లయల సమయంలో గుండె త్వరగా, అస్థిరంగా కొట్టుకుంటుంది. తద్వారా శరీరమంతా రక్తాన్ని తగినంతగా పంప్ చేయడం గుండెకు కష్టమవుతుంది.