- మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ఘటన
- మృతులంతా యాదగిరిగుట్ట జిల్లా వాసులు
- టూరిస్టు ప్లేసులు చూసి షిర్డీ వెళ్తుండగా ప్రమాదం
- డెడ్‌బాడీలపై ఉన్న 10 తులాల గోల్డ్ మాయం
మోత్కూరు, వెలుగు: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు చనిపోయారు. షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వెహికల్.. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆరు నెలల బాబు ఉన్నాడు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఔరంగాబాద్ సమీపంలో గంగాపూర్- – వైజాపూర్ మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. మోత్కూరు మండలంలోని కొండగడపకు చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు. వీళ్లు తన కొడుకు, కోడలు, ఇద్దరు కూతుళ్లు, అల్లుండ్లు, మనుమలు, మనురాళ్లు మొత్తం 14 మంది సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో షిర్టీకి వెళ్లారు. మంగళవారం రాత్రి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం తుఫాన్ వెహికల్ అద్దెకు తీసుకుని దగ్గర్లో ఉన్న టూరిస్ట్ ప్లేసులు చూశారు.
స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఔరంగాబాద్ సమీపంలో గంగాపూర్ – వైజాపూర్ మధ్యలో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి తుఫాన్ వెహికల్ ఢీ కొట్టింది. దీంతో కృష్ణమూర్తి భార్య ప్రేమలత (60), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42), ఆమె కూతురు అక్షిత (22), మనుమడు వైద్విక్ నందన్ (6 నెలలు) స్పాట్లోనే చనిపోయారు. కృష్ణమూర్తి మెడ నరాలు చిట్లిపోగా, ప్రసన్నలక్ష్మీ చిన్న కూతురు శరణ్య నడుము విరిగింది. మిగిలినవాళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు మహారాష్ట్ర వెళ్లారు. కృష్ణమూర్తి కొడుకుకు పెండ్లైన ఎనిమిదేండ్లకు మనుమడు వైద్విక్ నందన్ పుట్టాడు. ఈ ప్రమాదంలో వైద్విక్ నందన్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడే గోల్డ్ చోరీ
డెడ్ బాడీలపై ఉన్న సుమారు 10 తలాల గోల్డ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని గంగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగాక డెడ్ బాడీలతో పాటు గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లోకి ఎక్కించే ముందు డెడ్ బాడీలపై సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.13 వేల నగదు ఉన్నాయని తెలిపారు. అంబులెన్స్ నుంచి దించి ఆస్పత్రిలోకి తీసుకెళ్లేటప్పుడు బంగారం, డబ్బు కనిపించలేదని కుటుంబ సభ్యులు వివరించారు. హెల్త్ సిబ్బందిని అడిగినా చెప్పడం లేదని, దీంతో స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పోస్టుమార్టం పూర్తయితే శుక్రవారం మృతదేహాలను కొండగడపకు తరలించి అంత్యక్రియలు చేస్తామని తెలిపారు.