- మహాపూజతో ప్రారంభించిన మెస్రం వంశీయులు
- పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం
- భేటింగ్లో పాల్గొన్న కొత్త కోడళ్లు
- వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
ఆదిలాబాద్, వెలుగు: గిరిజనుల వేడుక నాగోబా జాతర ప్రారంభమైంది. ప్రతిఏటా పుష్యమాస అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం నాగోబాకు అభిషేకం చేసి, మహాపూజ చేశారు. తర్వాత జాతర ప్రారంభమైనట్టు ప్రకటించారు. మహాపూజ అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు చేశారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.
ఉదయం నుంచి పూజలు..
మంగళవారం ఉదయాన్నే నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రి, మర్రిచెట్టు వద్ద ఉన్న పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ఎదుట ఉన్న మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం లోపలికి ప్రవేశించారు. అనంతరం మెస్రం వంశం పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను అందించారు. ఆ వంశం అల్లుళ్లు, ఆడపడుచులు కొత్త కుండలతో కోనేరు బావి నుంచి సేకరించిన పవిత్ర జలంతో ఆలయానికి చేరుకున్నారు. అల్లుళ్లు పాత మట్టి పుట్టను తవ్వారు. ఆ మట్టితో ఆడపడుచులు, మెస్రం వంశ మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు. అందులోంచి తీసిన మట్టిని ఉండల రూపంలో తీసుకొని సతీ దేవత ఆలయం చేరుకున్నారు. అక్కడ ఏడు వరుసలతో బౌల దేవతలకు చేసి పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు ఆలయానికి వస్తున్న సమయంలో గేటు వద్దకు పాము వచ్చింది. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
కొత్త కోడళ్ల భేటింగ్..
నాగోబా జాతర సందర్భంగా ప్రతి పూజలో మెస్రం వంశీయుల ప్రత్యేకత కనిపిస్తుంది. ఇందులో కొత్త కోడళ్ల భేటింగ్ ఒకటి. మంగళవారం రాత్రి ఒంటి గంట నుంచి బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు భేటింగ్ నిర్వహించారు. మెస్రం వంశంలో కొత్తగా పెళ్లి చేసుకున్న కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి పూజలో పాల్గొన్నారు. భేటింగ్ లో పాల్గొన్న మెస్రం వంశ కోడళ్లతో మెస్రం వంశ మహిళలు సతీ దేవత, నాగోబా ఆలయాల్లో పూజలు చేయించారు. అనంతరం వారు మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త కోడళ్లు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టుగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశం పటేల్ వెంకట్రావ్, పెద్దలు ఓసేరాన్ బాదిరావు, లింబారావు తదితరులు పాల్గొన్నారు.