వడ్ల బస్తా మోసిన ఎమ్మెల్యే
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వడ్ల బస్తా మోసి, కాసేపు హమాలీ అవతారం ఎత్తారు. శనివారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రాజయ్య ప్రారంభించారు. తూకం వేయాల్సిన 40 కిలోల వడ్ల బస్తాను మోశారు. బస్తాను తూకం వేసి రైతులను సంతృప్తిపరిచారు.
ముగిసిన బుగులోని జాతర
కొండ దిగిన స్వామివారు
రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో బుగులోని జాతర ముగిసింది. మూడ్రోజులుగా పూజలందుకున్న స్వామి వారు శనివారం కొండ దిగారు. వెంకటేశ్వరస్వామి, అలువేలుమంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వంశీయ అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటికి చేర్చారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీలను రేగొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం
స్టేషన్ ఘన్పూర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారమని ఆ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర బర్త్‌డే సందర్భంగా శనివారం ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. ఇందిర నాయకత్వంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు లింగాల జగదీశ్‌చందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు జూలకుంట్ల శిరీశ్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చింత ఎల్లయ్య, సింగపురం నాగయ్య, రడపాక రాజ్‌కుమార్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చింత జ్యోత్స్న పాల్గొన్నారు.
దళితబంధు పేదలకు వరం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు, వెలుగు: దళితబంధు పేదలకు వరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, తొర్రూరు ప్రాంతాల్లో దళితబంధుపై వేర్వేరుగా రివ్యూ చేశారు. త్వరలోనే విడతల వారీగా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టి, యూనిట్లు అందజేస్తామన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 1500 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి, ఉచితంగా కుట్టు మెషిన్లు అందజేస్తామన్నారు. స్టూడెంట్ల యూనిఫామ్ కుట్టేందుకు వీరికి చాన్స్ ఇస్తామన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వరి, జడ్పీటీసీలు శ్రీనివాస్, జ్యోతిర్మయి, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్ రావు, వెంకటనారాయణ గౌడ్ తదితరులున్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభం..
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలో శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలోనూ అమలు చేయాలని ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. అయినా కేసీఆర్ మీటర్లు పెట్టడం లేదని
తెలిపారు.
‘హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం’ ఆవిష్కరణ
హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సంపదను సేకరించి బృహత్ గ్రంథాలుగా ప్రచురించడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ డా.ఎం.సుధీర్ కుమార్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు చేపట్టిన 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్య గ్రంథాల ప్రచురణలో భాగంగా రూపొందించిన 'హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం' బుక్ ను శనివారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో ఆవిష్కరించారు. చీఫ్ గెస్ట్ హాజరైన సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ గొప్పతనాన్ని ముందు తరాలకు అందించేందుకు ఈ గ్రంథాలు ఉపయోగపడతాయన్నారు. పరిశోధకులు, కవులు, రచయితలు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధిపై గ్రంథాలు రచించాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రచనల రూపంలో వెలువరించాలని సూచించారు. సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.బన్న అయిలయ్య. ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య , ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ, కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.ఎన్.చారి తదితరులు పాల్గొన్నారు.
జనగామలో లోక్ అదాలత్
జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లా కోర్డు ఆవరణలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా జిల్లా జడ్జి శైలజ హాజరై, కక్షిదారులతో మాట్లాడారు. ఈ ప్రోగ్రాంతో సత్వరమే పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, పెంబర్తి హస్త కళలు, బ్యాంకింగ్రుణాల స్టాళ్లను జడ్జి పరిశీలించారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 1828 కేసులు పరిష్కారం అయినట్లు అధికారులు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి పి.ఆంజనేయులు, జూనియర్ సివిల్ జడ్జి డీటీ పృథ్వీరాజ్, అడిషనల్ జూనియర్‌సివిల్ జడ్జి సీహెచ్నర్మద, డీసీపీ సీతారాం, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే మోడీ ధ్యేయం
రైతును రాజు చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యేయమని బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు స్పష్టం చేశారు. శనివారం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోడీ జాతికి అంకితం చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ఫ్యాక్టరీ వల్ల రైతులకు ఎరువుల కొరత ఉండదన్నారు. ఇదిలా ఉండగా.. మోడీ ప్రసంగం వినేందుకు నియోజకవర్గ, మండలకేంద్రాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మోడీ చిత్రపటాలకు
క్షీరాభిషేకం చేశారు. - వెలుగు నెట్ వర్క్
మోడీని కలిసిన ప్రదీప్ రావు
కాశిబుగ్గ, వెలుగు: భారత ప్రధాని నరేంద్ర మోడీని శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కలిశారు. ఢిల్లీకి వెళ్తున్న మోడీకి వీడ్కోలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గిరిజన యూనివర్సిటీని ఓపెన్ చేయాలి
ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
ములుగులో భారీ బైక్ ర్యాలీ
ములుగు, వెలుగు: ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే గిరిజనులపై వివక్ష చూపిస్తున్నాయని మండిపడ్డారు. శనివారం ములుగులో డీసీసీ అధ్యక్షుడు నల్లాల కుమారస్వామి ఆధ్వర్యంలో 500 బైక్‌లతో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వెంటనే యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి, ఇతర చోట తాత్కాలిక తరగతులు నిర్వహించాలన్నారు. గవర్నర్‌కు కూడా దీనిపై లేఖ రాశానని గుర్తు చేశారు.
కేంద్రానిది తప్పు లేదు!
ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రానిది తప్పు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. పక్కనున్న ఏపీలో క్లాసులు నడుస్తుంటే.. ఇక్కడ ఎందుకు నడవడం లేదో ఆలోచించాలన్నారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ తప్పేనని స్పష్టం చేశారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు.
అస్తవ్యస్తంగా రిజర్వేషన్ వ్యవస్థ
హనుమకొండ సిటీ, వెలుగు: దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ అన్నారు. హనుమకొండ హరిత కాకతీయలో ఈ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్ కమిటీ సభ్యులు శనివారం సమకాలీన రాజకీయ పరిస్థితులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. వెనుకబడి ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు సబబేనని సుప్రీం కోర్ట్ బెంచ్ తీర్పు బాధించిందన్నారు. ఇందిరా సహానీ కేసు తీర్పులో రిజర్వేషన్ లు 50 శాతం మించకూడదన్న 9 మంది సభ్యుల ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు సుప్రీంకోర్ట్ స్వయంగా తానే తిలోదకాలిచ్చిందన్నారు. అనేక సార్లు బీసీల రిజర్వేషన్లను వారి జనాభాకు అనుగుణంగా పెంచాలని వచ్చిన పిటిషన్లను ధర్మాసనం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.బీసీ జనాభాకు సమానంగా బీసీ రేజర్వేషన్లు, సమానత్వపు హక్కులను రాజ్యాంగబద్దంగా సాధించుకోవడానికి దేనికైనా తాము సిద్ధమేనని దాసు సురేశ్ స్పష్టం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్ కమిటీ సభ్యులు, ప్రముఖ న్యాయవాది సట్ల రామనాథం, దారబోయిన వీరస్వామి యాదవ్, చాపర్తి కుమార్ గాడ్గే, శనిగరపు రాజు, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
‘భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు’
ఎమ్మెల్యే చల్లాకు శాలివాహన సంక్షేమ సంఘం వార్నింగ్
వరంగల్ సిటీ, వెలుగు: మెగా టెక్స్టైల్ పేరుతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎట్టిపరిస్థితుల్లో కుమ్మరి కులస్తుల భూముల జోలికి రావొద్దని శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నారపు రామరాజు హెచ్చరించారు. శనివారం హంటర్ రోడ్‍లోని సంఘం ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడారు. వందల ఏళ్ల నుంచి కుమ్మరులు గీసుగొండ శివారు శాయంపేటలోని భూములను నమ్ముకుని బతుకుతున్నారన్నారు. టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటు కోసం గతంలోనే రూ.50 లక్షల విలువ చేసే భూములను రూ.10 లక్షల చొప్పున ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ భూముల జోలికి రామంటూ అధికార పార్టీ లీడర్లు ఇచ్చిన మాటను పక్కనబెట్టి, రైతులను బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. అధికారులు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నేతలు సముద్రాల వెంకటేశ్వర్లు, సాంబయ్య, మౌనిక, సులోచన, సంజీవ, సంపత్, ఐలయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై బీజేపీ కక్ష
మోడీకి వ్యతిరేకంగా సీపీఐ, టీఆర్ఎస్ ధర్నా
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ చింతకుంట్ల నరేందర్‌రెడ్డి ఇంటి ఆవరణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ విభజన హమీలపై స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవాచేశారు. కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుని ప్రభుత్వాలను కూల్చేస్తోందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తున్నదన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీ పర్యాటనకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీపీఐ, టీఆర్ఎస్ లీడర్లు నిరసన తెలిపారు. విభజన హామీలపై మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.