ఆదిలాబాద్ జిల్లా తుకారాంనగర్ పరిధిలో దారుణం
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఓ గిరిజన మహిళ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. గంగాపూర్ గ్రామ పంచాయితీ తుకారాంనగర్‌కు చెందిన మెస్రం దేవుబాయి(45) సోమవారం ఉదయం ఊరికి సమీపంలోని తన పత్తి చేనులో పనులకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త మోతీరాం చేనుతో పాటు చుట్టుపక్కల గాలించాడు. అయినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం మళ్లీ చేసుకు వెళ్లి చూడగా రక్తపు మరకలు కనిపించడంతో గ్రామస్తులకు చెప్పాడు.
వారు వచ్చి చేనులో గాలించగా చెత్త కుప్పల కింద దేవుబాయి డెడ్‌బాడీ కనిపించింది. సీఐ రామకృష్ణ, ఎస్సై మనోహర్ ఘటనా స్థలానికి వచ్చి డెడ్‌బాడీని పరిశీలించారు. మోతీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి దేవుడు(పూనకం) వస్తుండేదని, రోగాలతో బాధపడేవారికి గతంలో మందులు ఇచ్చేదని తెలుస్తోంది. దేవుబాయిని మంత్రాల నెపంతో హత్య చేశారా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.