- ఐదుగురు మృతి ఒడిశాలో ప్రమాదం
కియోంఝర్: ఒడిశాలోని కియోంఝర్జిల్లాలో బుధవారం ఉదయం పెండ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకుపోయింది. దీంతో ఐదుగురు మృతిచెందగా మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నేషనల్ హైవే నంబర్ 20 సాతింఝర్ సాహి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో వరుడు మేనల్లుడుతోపాటు వధువు తరఫున బంధువులు ముగ్గురు ఉన్నారు. ఈమేరకు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇన్స్పెక్టర్ సునీల్ కార్ వెల్లడించారు. ట్రక్కు వేగంగా దూసుకురావడంతో స్పాట్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని సీఐ తెలిపారు.
డీజే మ్యూజిక్, డ్యాన్స్ లతో పెండ్లి ఊరేగింపు మాన్పూర్ గ్రామం నుంచి బయలుదేరింది. పెండ్లి కూతురు ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో బార్రాటిస్వద్ద యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు వివరించారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని, వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో కటక్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. డ్రైవర్ను అరెస్టు చేసి, ట్రక్కును సీజ్ చేశామని చెప్పారు.