నారాయణ్‌ఖేడ్, వెలుగు : గుండెపోటుతో పన్నెండేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఇందిరా కాలనీలో మంగళవారం జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఇందిర కాలనీకి చెందిన జయమ్మకు ఐదుగురు పిల్లలు. భర్త గతంలోనే చనిపోవడంతో తానే కుటుంబాన్ని పోషిస్తోంది.
ఆమె చిన్న కుమారుడు నితిన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం స్కూల్‌కు రెడీ అయిన నితిన్ బ్రెడ్ తిని టీ తాగాడు. తర్వాత ఊపిరి ఆడడం లేదని తల్లితో చెప్పాడు. వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా బాలుడు గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిన్నతనంలో గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.