పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. రెండున్నరేళ్ల బాలుడు మృతి

పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. రెండున్నరేళ్ల బాలుడు మృతి

లక్నో: మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న టైమ్ వస్తే మరణం నుంచి తప్పించుకోలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కొందరు చేసే పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‎లో జరిగింది. పెళ్లి ఊరేగింపు వేడుకల్లో జరిపిన కాల్పుల్లో రెండున్నర సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. అధికారుల వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధి అఘాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. డీజే, బ్యాండ్, లైటింగ్‎తో దూమ్ ధామ్‎గా బరాత్ నిర్వహిస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా ఈ వేడుకను తిలకించారు.

కొందరు రోడ్డుపైకి వచ్చి ఊరేగింపు చూడగా.. మరికొందరు ఇంటి బాల్కనీల పై నుంచి బరాత్‎ను చూస్తున్నారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఒకరు గాల్లోకి కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తూ బుల్లెట్ బాల్కనీ నుంచి ఊరేగింపు చూస్తోన్న ఓ రెండున్నరేళ్ల బాలుడి తలలో నుంచి దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలున్ని ఆసుపత్రికి తరలించారు. 

ALSO READ | ఫ్యామిలీని ఇలా కూడా చంపుతారా: మైసూర్ వ్యాపారవేత్త హత్యలు, ఆత్మహత్య సంచలనం

అయితే.. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇదంతా పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తోన్న ఓ వ్యక్తి ఫోన్‎లో రికార్డ్ అయ్యింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బరాత్‎లో కాల్పులు జరిపిన యువకుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు కాల్పులు జరిపిన వ్యక్తి ఇంటిపై దాడి చేసే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా భద్రతను పెంచినట్లు పేర్కొనారు.