పాపం ఓ రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇత్తడి కొప్పెరలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమైనప్పుడు అక్కడే ఆడుకుంటున్న బాలుడు.. పక్కనే ఉన్న కొప్పెరలోకి దిగాడు. దీంతో అందులో ఇరుక్కుపోయాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి.. మొత్తం శరీరం కొప్పెరలోనే ఇరుక్కుపోయింది.
ఎంత ప్రయత్నించిన ఆ బాలున్ని మాత్రం బయటకు తీయలేకపోయారు. దీంతో స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు తీసుకెళ్లారు. అక్కడ గంటసేపు కష్టపడి కటర్లను ఉపయోగించి కొప్పెరను కత్తిరించి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు. అనంతరం బాలున్ని ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.