తల్లి, ప్రియుడి అరెస్టు
నార్కట్‌పల్లి, వెలుగు: ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కూతురును తల్లి, ఆమె ప్రియుడు హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులిద్దరిని అరెస్టు చేశారు. నల్గొండ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్న, కనగల్ మండలం లచ్చుగూడెం గ్రామానికి చెందిన రమ్య వివాహం 2015లో జరిగింది. వీరికి కొడుకు(5), కూతురు ప్రియాంశిక(2) ఉన్నారు. 2020లో కరోనాతో ఉయ్యాల వెంకన్న చనిపోయాడు. రమ్య ఇద్దరు పిల్లలతో అత్తగారింట్లోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కిరాణా షాపు నడుపుతున్న పెరిక వెంకన్నతో రమ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. పెరిక వెంకన్న పెండ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య సంబంధం రమ్య అత్తమామలకు తెలియడంతో పెద్ద మనుషుల మధ్య హెచ్చరించారు. దాంతో రమ్య చిట్యాలలో ఇల్లు అద్దెకు తీసుకుంది. పెరిక వెంకన్న సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో ఇల్లు ఖాళీ చేసి ఆరు నెలల క్రితం నార్కట్ పల్లి వెళ్లారు. భార్యాభర్తలమని చెప్పి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పెరిక వెంకన్న తరచూ రమ్య దగ్గరకు వచ్చి వెళుతుండేవాడు. అతను వచ్చినప్పుడల్లా చిన్నారి ప్రియాంశిక ఏడుస్తూ ఉండేది. దీంతో చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. రెండు వారాల క్రితం రమ్య తన పిల్లలకు ఏమైనా హాని జరిగితే దానికి అత్తామామలు, ఎలికట్టె గ్రామ ఎంపీటీసీ దశరథ, మాధగోని శీను, మరికొందరు కారణమంటూ ఒక వీడియో రికార్డు చేసింది. దానిని తన మేనమామ శీను, పెరిక వెంకన్నకు పంపంది. ఆ వీడియోను వెంకన్న విలేజ్ గ్రూపులో పెట్టాడు. ఈ నెల 14న సాయంత్రం పెరిక వెంకన్న, రమ్య చిన్నారిని కొట్టారు. పాప అరుపులు ఎవరికీ వినపడకుండా నోరు, ముక్కు గట్టిగా మూయడంతో ఊపిరాడక చనిపోయింది.
ఫిట్స్‌తో చిన్నారి స్పృహ కోల్పోయిందంటూ రాత్రి 11 గంటలకు పాపను నల్గొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. డాక్టర్లు చూసి అప్పటికే చనిపోయిందని చెప్పారు. డెడ్‌బాడీని మార్చురీ గదిలో పెట్టి రమ్య, పెరిక వెంకన్న పరారయ్యారు. ఆస్పత్రికి వచ్చిన బంధువులు చిన్నారిని పరిశీలించగా ముఖం, మెడపై గాయాలు కనిపించాయి. దాంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమ్య, పెరిక వెంకన్నపై మామ అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పెరిక వెంకన్న, రమ్యను అరెస్టు చేశారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. కేసు విచారించిన సీఐ శివరామిరెడ్డి, ఎస్సై రామకృష్ణ, ఏఎస్సై నర్సిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, రమేశ్‌ను డీఎస్పీ అభినందించారు.