- రాష్ట్రంలోని పంచాయతీల్లో ఫస్ట్ యూనిట్ ఇక్కడే..
- హోటళ్లలో పొయ్యిలోకి ఊకకు బదులుగా వాడేలా ప్లాన్
- ‘చెత్త’ సమస్యకు పరిష్కారం.. పంచాయతీకి ఆదాయం..
- చకచక యూనిట్పనులు.. త్వరలోనే ప్రారంభం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం గ్రామపంచాయతీలో తడి చెత్తతో బ్రిక్స్(ఇటుకలు) తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని హోటళ్లలో ధాన్యం ఊకకు బదులుగా పొయ్యిలో ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ హీట్ ఇచ్చే వీటిని పొయ్యిలో వినియోగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తడి చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేసే యూనిట్ కేవలం హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ మున్సిపాల్టీలో మాత్రమే ఉంది. భద్రాచలంలో ఏర్పాటు చేసేది రెండో యూనిట్. కాగా రాష్ట్రంలో ఈ యూనిట్ ఉన్న ఏకైక పంచాయతీగా భద్రాచలం రికార్డులెక్కనుంది.
8.5 ఎకరాల్లో డంపింగ్ యార్డు
భద్రాచలంలో డంపింగ్‌యార్డును మనుబోతుల చెరువు ప్రాంతంలో 8.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 1.5 ఎకరాల్లో డంపింగ్ యార్డు, మిగతా ఏడు ఎకరాల్లో వనం పెంచనున్నారు. ఇందుకు రూ.80లక్షలను ఖర్చు చేస్తున్నారు. ఇందులో పొడి, తడి చెత్తను వేరు చేసే యంత్రాల కోసం ఐటీసీ పేపరుబోర్డు రూ.70లక్షలు, గ్రామపంచాయతీ రూ.50లక్షలు వెచ్చిస్తున్నాయి. ఇందుకోసం రూ.18లక్షలతో 11కేవీ విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు.
రూ.60లక్షలతో మిషనరీ..
భద్రాచలం గ్రామపంచాయతీలో రోజుకు 15 టన్నుల చెత్త వస్తోంది. ఈ చెత్తను వేరు చేసే యంత్రాలను బిగిస్తున్నారు. తడి చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేసేందుకు ఆఫీసర్లు హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ మున్సిపాల్టీని సందర్శించారు. అక్కడ తడి చెత్తతో బ్రిక్స్ తయారు చేసే విధానంపై అధ్యయనం చేశారు. కోయంబత్తూరు నుంచి తెచ్చిన మిషనరీ గురించి తెలుసుకున్నారు. బ్రిక్స్ ను కూడా పరీక్షించారు. అయితే పీర్జాదిగూడ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మిషనరీని భద్రాచంలం గ్రామ పంచాయతీ కోసం రూ.60లక్షలు వెచ్చించి తెచ్చారు.
Also Read :- మీ డిమాండ్లు తీర్చలేం
మొత్తం నాలుగు మిషన్లు ఉంటాయి. వీటిని ప్రస్తుతం డంపింగ్ యార్డులో బిగిస్తున్నారు. పంచాయతీలో సేకరించిన తడి చెత్త నుంచి ఈ మిషనరీ ద్వారా బ్రిక్స్ తయారు చేస్తారు. రోజుకు 10 టన్నుల తడి చెత్తను బ్రిక్స్ గా మార్చనున్నారు. కేవలం 24 గంటల్లోనే ఇవి తయారవుతాయి. భద్రాచలంతో పాటు చుట్టుపక్కల సారపాక, బూర్గంపాడు, మోరంపల్లి బంజర పంచాయతీల నుంచి చెత్తను భద్రాచలం డంపింగ్‌యార్డుకు
తరలించనున్నారు.
త్వరలో స్టార్ట్ చేస్తాం..
డంపింగ్ యార్డు పనులు పూర్తవుతున్నాయి. త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తడి, పొడి చెత్తను ఇకపై మనుబోతుల చెరువు ప్రాంతంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తాం. తడి చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేసే యూనిట్ వల్ల పంచాయతీకి ఆదాయం కూడా వస్తుంది. ప్రయోగాత్మకంగా పీర్జాదిగూడ మున్సిపాల్టీని సందర్శించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం.- శ్రీనివాసరావు, ఈవో, భద్రాచలం పంచాయతీ