జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురును చూసేందుకు వచ్చిన ఓ తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. 15 నిముషాల పాటు అంబులెన్స్ ఆగిపోయింది. ఆస్పత్రిలో చేర్చగా.. అప్పటికే అతడి ప్రాణం పోయింది. ఈ హృదయ విచారకర ఘటన అందరిని కలచివేస్తోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి విజయ్ (52 ) మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోన్న తన కూతురును చూడటానికి వెళ్లాడు. రెండవ శనివారం కావడంతో స్కూల్లో పేరెంట్స్ డే నిర్వహించగా ఆ ప్రోగ్రాంకి హాజరయ్యాడు. స్కూల్ లోనే గుండెపోటు రావడంతో స్కూల్ సిబ్బంది అంబులెన్స్ లో తరలించారు. అయితే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలో రైల్వే గేట్ పడింది. 15 నిముషాల అంబులెన్స్ లోనే విజయ్ కొట్టుమిట్టాడు. తీరా ఆసుపత్రికి చేరుకున్నాక అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కరీంనగర్ రైల్వే గేట్ దాటగానే అపోలో రీచ్ హాస్పిటల్ ఉండగా రైల్వే గేట్ పడింది. రైల్వే గేట్ పడకుంటే బ్రతికేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.