- బోధన్ డిపో కండక్టర్ టికెట్లకు డబ్బులు తీసుకున్నాడని గొడవ
- సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వీడియో వైరల్
- విచారణకు ఆదేశించిన ఎండీ సజ్జనార్
- కండక్టర్ తప్పు లేదని ఆర్టీసీ ప్రకటన
నిజామాబాద్, వెలుగు : సర్కారు బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేస్తున్నా.. మహిళలకు టికెట్లు ఎలా తీసుకున్నావంటూ ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. ఇది సంస్థ ఎండీ సజ్జనార్దాకా వెళ్లడంతో కండక్టర్‌ను డిపో స్పేర్‌లో పెట్టి పూర్తి స్థాయి విచారణకు ఆర్ఎం కె.జానారెడ్డిని ఆదేశించారు. అయితే, వారి విచారణలో కండక్టర్ తప్పేం లేదని తేలింది.
బోధన్ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు నిజామాబాద్వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్తున్న టైంలో పాత బస్టాండ్‌లో ఇద్దరు ముస్లిం మహిళలు, వారి కుటుంబానికే చెందిన మరో వ్యక్తి ఎక్కాడు. బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ అని తెలియని అతడు మూడు టికెట్లు ఇవ్వాలని కండక్టర్‌ను కోరగా అందరూ మగవారే అనుకుని టికెట్లిచ్చాడు. కొద్దిసేపటికే విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి లేడీస్‌కు ఫ్రీ కాబట్టి రెండు టికెట్ల డబ్బులు రిటర్న్ ఇవ్వాలని కోరాడు.
దీనికి కండక్టర్ఒప్పుకోలేదు. అప్పటికే ఎస్ఆర్ రాసినందున మగ ప్రయాణికులు ఎవరైనా ఎక్కితే వారికి ఆ టికెట్లిచ్చి పైసలు వచ్చేలా చూస్తానని చెప్పాడు. అయినా వినని అతడు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో వైరల్చేశాడు. ముస్లిం మహిళలు కాబట్టే కండక్టర్ టికెట్లకు డబ్బులు తీసుకున్నారని ప్రచారం జరిగింది.
ఈ వీడియో ఆర్టీసీ ఎండీ సజ్జనార్దాకా వెళ్లడంతో కండక్టర్నర్సింహులును డిపో స్పేర్‌లో పెట్టి విచారణకు ఆదేశించారు. తమ ఎంక్వైరీలో కండక్టర్ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని తేలిందని, ముగ్గురూ మగవారే అనుకుని టికెట్ఇచ్చాడని ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డబ్బులు కూడా తిరిగి ఇచ్చాడని వివాదం సమసిపోయిందన్నారు.