ఆర్టీసీ బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ.. అసలేం జరిగింది..?

మెట్ పల్లిలో ఆర్టీసీ బస్సు కింద తలపెట్టేందుకు ప్రయత్నించిన మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. గురువారం (జులై 20న) సాయంత్రం మెట్‌పల్లి నుంచి జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద ఆగింది. అక్కడున్న ప్రయాణికులు కొందరు బస్సు ఎక్కారు. ఇంతలో పుప్పాల లక్ష్మీ(48) అనే మహిళ నడుచుకుంటూ బస్సు ఎక్కుతున్నట్లు ముందుకెళ్లింది. బస్సు ఎక్కకుండా.. దానికి అనుకుని నిలబడి.. బస్సు ముందుకు బయలుదేరుతున్న సమయంలో టైరు కింద తల పెట్టింది. వెంటనే పెద్ద శబ్ధం రావడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో పుప్పాల లక్ష్మీ కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. పుప్పాల లక్ష్మీ రోడ్డుపై నడుచుకుంటూ బస్సు వద్దకు వచ్చి ఆగినట్లు, బస్సు కింద పడిపోయినట్లుగా విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. సదరు మహిళే కావాలని బస్సు చక్రాల కింద పడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని చాలామంది అనుమానిస్తున్నారు. 

అయితే.. పుప్పాల లక్ష్మీ కుటుంబ సభ్యులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. లక్ష్మీకి బీపీ, షుగర్ ఉన్నాయని.. బస్సు ఎక్కేటప్పుడు కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదంటున్నారు. ప్రస్తుతం లక్ష్మీ అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, త్వరలో పూర్తి విషయాలు తెలుస్తాయని మెట్ పల్లి ఎస్ఐ శ్యామ్ రాజ్ తెలిపారు. 

ఈ ఘటన గురువారం రోజు (జులై 20న) జరిగినప్పుడు అందరూ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. కానీ..సీసీ కెమెరాల్లోని విజువల్స్ చూసిన తర్వాత చాలా మంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా లక్ష్మీ కోలుకున్న తర్వాతే అసలు నిజలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. 

https://twitter.com/TeluguScribe/status/1682344329850007553