Viral Video: వందే భారత్ ట్రైన్ అద్దాలు సుత్తితో బద్ధలు కొట్టడం ఏంటన్నా..!

Viral Video: వందే భారత్ ట్రైన్ అద్దాలు సుత్తితో బద్ధలు కొట్టడం ఏంటన్నా..!

వందే భారత్ ట్రైన్లపై ఏదో ఒకచోట ఆకతాయిల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. వందేభారత్ ట్రైన్ విండోను ఒక యువకుడు సుత్తితో బద్ధలు కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు గానీ వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి దుశ్చర్యపై మండిపడ్డారు. అతనిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు. అదే ట్రైన్కు కట్టేసి అతని సంగతేంటో చూడాలని మరికొందరు నెటిజన్లు ‘ఎక్స్’లో కామెంట్ చేశారు.

 

రైల్వే శాఖ అధికారిక ‘ఎక్స్’ పేజ్ను ట్యాగ్ చేసి కఠినంగా శిక్షించాలని ఇంకొందరు నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోపై మరో వాదన కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఆ వందే భారత్ ట్రైన్ సర్వీస్ స్టేషన్లో ఉందని, ఆ వ్యక్తి విండో రీప్లేస్మెంట్లో భాగంగా ఆ విండోను బద్ధలు కొడుతున్నాడని ‘ఎక్స్’ యూజర్ ఒకరు చెప్పుకొచ్చాడు. అతను కేవలం ఒక వర్కర్ అని, ఆ గ్లాస్ విండోను రీప్లేస్ చేయమని తనకు కాంట్రాక్టర్ అసైన్ చేసిన వర్క్ చేస్తున్నాడని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. అతను నిజంగానే వర్కరా లేక ఆకతాయి చేష్టలకు పూనుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల వందే భారత్ ట్రైన్లపై ఆకతాయిలు రాళ్లు రువ్విన ఘటనలు, వందే భారత్ రైళ్ల అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.