మనసెలా వచ్చిందో.. బాత్రూం కమోడ్ పక్కనున్న ట్యాప్కు పైప్ తగిలించి.. ఆ నీళ్లతో..

మనసెలా వచ్చిందో.. బాత్రూం కమోడ్ పక్కనున్న ట్యాప్కు పైప్ తగిలించి.. ఆ నీళ్లతో..

జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి దారుణం అని తిట్టిపోస్తున్నారు. ఆ వీడియోలో అసలేం ఉందంటే.. ఫిబ్రవరి 6న జబల్పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్లో జాతీయ స్థాయి వైద్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దేశంలోనే పేరుగాంచిన వైద్యులు హాజరయ్యారు. ఈ ఐఎస్ఎస్పీ కాన్ఫరెన్స్ దిగ్విజయంగా ముగిసింది. అయితే.. ఆ రోజు ఆ వైద్య సదస్సుకు వచ్చిన వైద్యుల కోసం వండిన భోజనం బాత్రూం ట్యాప్ వాటర్తో వండారని తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది.

ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల్లో ఏముందంటే.. ఒక రబ్బర్ పైపును బాత్రూంలోని ట్యాప్కు అమర్చారు. ఆ పైప్ బాత్రూం నుంచి వంటలు చేస్తున్న వాళ్ల వరకూ కనిపించింది. ఆ నీళ్లతోనే పాత్రలు కడుగుతున్నారు. ఆ నీళ్లతోనే ఎసరు పోస్తున్నారు. వంటంతా ఆ నీళ్లతోనే చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కాలేజ్ అథారిటీస్ను ఇదేంటని అడగగా.. కేవలం పాత్రలు కడగటానికి మాత్రమే వంటవాళ్లు ఆ నీళ్లను వాడారని చెప్పుకొచ్చారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్  మిశ్రా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.