హరప్పాలో ఆనాడే వాష్ రూమ్ లు

హరప్పాలో ఆనాడే వాష్ రూమ్ లు

దేశంలో ఏ ఊరిని చూసినా… మరుగుదొడ్డి, మురుగుకాలువ, మంచి రోడ్డు కనిపించవు. అసలు ఈ మూడు విషయాల్ని పట్టించుకోకుండానే ఊళ్లకు ఊళ్లు తయారైపోయాయి. 2014లో ఫస్ట్​ టైమ్​ నరేంద్ర మోడీ అధికారానికొచ్చాక టాప్​ ప్రయారిటీగా గ్రామీణ స్వచ్ఛతను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ‘స్వచ్ఛ భారత్’ ఆరంభించారు. ప్రతి ఇంటికి టాయిలెట్​ గురించి ఇప్పుడు వింటున్నాం కానీ, ఈ విషయంలో మన పూర్వీకులు చాలా ముందుచూపున్నవాళ్లు. శానిటేషన్​కు, టాయిలెట్​కుగల సంబంధాన్ని మిగతా దేశాలకంటే చాలా ముందుగానే మనవాళ్లు గుర్తించారు. అందుకు నిదర్శనం కొన్ని వేల ఏళ్ల కిందట హరప్పా నాగరికత. ఆ కాలంలోనే ఇళ్లల్లో టాయిలెట్లు ఉండటం. శానిటేషన్​పై అప్పటి ప్రజలు చాలా అడ్వాన్స్​డ్​గా ఉండేవారట. అప్పట్లో చెంబు పట్టుకుని ఊరి బయటకు వెళ్లే కల్చర్ లేనే లేదట. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో హరప్పా నాగరికతతో పాటు టాయిలెట్ కల్చర్ కూడా అంతరించి పోయి, ప్రజలకు ఆరుబయలు ప్రాంతాల్లో టాయిలెట్​ అవసరాలు తీర్చుకోవడం అలవాటైంది. చాలా తక్కువగా మాత్రమే ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేవి. అవికూడా రోజూ ఎత్తిపారేసే పద్ధతిలో కట్టుకునేవారు. చేతులతో నైట్​ సాయిల్​ని తీసే స్కావెంజర్లు ఉండేవారు.

ఈ పరిస్థితుల్ని సోషియాలజీ చదివిన బిందేశ్వర్ పాఠక్ గమనించారు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో సైతం రద్దీగా ఉండే చోట్ల పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడాన్ని గుర్తించారు. అపరిశుభ్రతతో అంటువ్యాధులు వ్యాపించడాన్ని చూసి.. 1970లో సులభ్​ సంస్థను మొదలెట్టారు. దేశవ్యాప్తంగా పబ్లిక్​ టాయిలెట్ల నిర్మాణాన్ని చాలా సీరియస్​గా చేపట్టారు.  క్రమంగా దాని విలువను జనం గుర్తించారు. అంతటితో ఆగకుండా ఒక ‘టాయిలెట్ మ్యూజియం’నుకూడా ఏర్పాటు చేసింది సులభ్​ సంస్థ.

డిఫరెంట్​ మ్యూజియం

సహజంగా మ్యూజియం అనగానే ఏదైనా కళాఖండాలకు సంబంధించింది అనుకుంటాం. ఢిల్లీ శివారులో ఉన్న ఈ మ్యూజియం పూర్తిగా డిఫరెంట్​. నిత్య జీవితంలో మనిషికి వాష్​రూమ్​ వసతి ఎంత అవసరమో తెలియచేస్తుంది ఈ మ్యూజియం. టాయిలెట్ లేకపోవడం వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టాల్ని వివరిస్తుంది.  టాయిలెట్లకు సంబంధించిన టోటల్​ ఇన్ఫర్మేషన్​ ఈ మ్యూజియంలో దొరుకుతుంది. క్రీస్తు పూర్వంనాటి ‘ఏన్షియెంట్​ (ప్రాచీన) కల్చర్​’ గురించి, గుప్తుల కాలం నుంచి మొఘలుల పాలన వరకుగల ‘మధ్య యుగం సంస్కృతి’ గురించి, బ్రిటిషర్ల వలస పాలన నుంచి ఇప్పటి పరిస్థితుల వరకుగల ‘మోడర్న్​ కల్చర్​’ గురించి మొత్తం మూడు విభాగాల్లో టాయిలెట్​​ మోడల్స్​ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అత్యంత  పురాతన టాయిలెట్ వ్యవస్థ నుంచి ఇప్పటి మోడ్రన్ సిస్టం వరకు ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తుంది.

ఐడియా ఎలా వచ్చింది?

డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ఓసారి లండన్ వెళ్లినప్పుడు అక్కడి ‘వాక్స్ మ్యూజియం’ చూడటానికి  వెళ్లారు. అనేక అంశాలకు సంబంధించి మ్యూజియంలు ఉన్నప్పుడు… ప్రజల ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించే టాయిలెట్​కు ఎందుకు ఉండకూడదన్న ఆలోచన ఆయనకు వచ్చింది.

50 దేశాల కమోడ్​ మోడల్స్​

దాదాపు 50 దేశాలకు సంబంధించిన కమోడ్​ మోడల్స్​ను మ్యూజియంలో పెట్టారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాలతో టాయిలెట్ల నిర్మాణం ఏయే దేశాల్లో జరుగుతుందో తెలియచేసే మోడల్స్ అన్నీ ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.కొన్ని మోడల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటివాటిలో ఫ్రెంచ్ చక్రవర్తి 14వ లూయీ వాడిన సింహాసనం టైపు కమోడ్​ ఒకటి. విక్టోరియన్ కాలంలో కమోడ్లపై అందమైన పెయింటింగ్స్ వేసేవారట. అందుకు సంబంధించిన మోడల్స్ కూడా చూసేవాళ్లను ఆకట్టుకుంటాయి. ఓ పెద్ద బుక్ షేపులో ఉండే కమోడ్ మోడల్ కూడా చాలా ఇంటరెస్టింగ్​గా ఉంటుంది. ఈ మ్యూజియంను ఎవరైనా చూడొచ్చు. ఎంట్రెన్స్ ఫీజు లేదు. ప్రతిరోజూ దాదాపు పది వేల మంది మ్యూజియం చూడటానికి వస్తున్నారు.