ఎమ్మెల్యే పదవులపై కన్నేసిన మెజార్టీ ఎమ్మెల్సీలు
ఎమ్మెల్సీలను కార్యక్రమాలకు ఆహ్వానించని ఎమ్మెల్యేలు
సోషల్‌మీడియాలో విమర్శలు, సవాళ్లు
వరంగల్/నెట్వర్క్, వెలుగు: అధికార బీఆర్‍ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య వార్ జరుగుతోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తాము నిర్వహించే కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను ఆహ్వానించడంలేదు. పార్టీ కేడర్‍ను వారి వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. చాలాచోట్ల సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీలను అపొజిషన్ లీడర్లుగా చూస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీకి మంచి హోదా ఉన్నా.. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో వాళ్ల మాట చెల్లుబాటు కావడం లేదు. పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకే ఫుల్ పవర్స్ ఇవ్వడంతో నియోజకవర్గాల్లో వారి హవానే నడుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ ఎమ్మెల్సీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని ఆరాటపడుతున్నారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జనాల్లో కొంత నెగెటివ్ ఉన్న.. హైకమాండ్ వద్ద కొంత నమ్మకం పోగొట్టుకుంటున్న వారి నియోజకవర్గాలపై కన్నేస్తున్నారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తితో రగిలే లీడర్లను చేరదీస్తున్నారు. కేడర్‍ను తెరవెనుక నుంచి యాక్టివ్ చేస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‍లు, యూత్ లీడర్ల వంటి నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఇంకొందరైతే.. ‘‘వచ్చేసారి ఎమ్మెల్యే టికెట్ నాకే” అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇరువర్గాల నేతలు సోషల్‌మీడియాలోనూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుండడంతో రాజకీయం వేడెక్కుతోంది.
రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా తొమ్మిది మంది ఉన్నారు. వీళ్లలో సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‍రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్‍రావు తదితరులు ఉన్నారు. వీళ్లు కాకుండా హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ నుంచి పాడి కౌశిక్‍రెడ్డి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్, సీఎం సన్నిహితుడైన పల్లారాజేశ్వర్రెడ్డిని మినహాయిస్తే మిగిలినవాళ్లకు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వ వ్యవహారాల్లో పెద్దగా ఇంపార్టెన్స్ దక్కడం లేదు. దీంతో వీరంతా ఎమ్మెల్యే టికెట్లపై కన్నేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో ఢీ అంటే ఢీ అంటున్నారు. మీడియా సాక్షిగా ఇరువురు ఎన్నోసార్లు గొడవ పడ్డారు.
డోర్నకల్ నాదే అంటున్న రెడ్యానాయక్
గిరిజన మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కూతురు మహబూబాబాద్ ఎంపీతో అంటీముట్టనట్లు ఉంటున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా రెడ్యానాయక్ డోర్నకల్ నాదేనంటూ.. ఇన్ డైరెక్ట్‌గా సత్యవతి రాథోడ్‍కు మెసేజ్ పంపిస్తున్నారు. సిరికొండ మధుసూదనాచారి ఈసారి భూపాలపల్లి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి తన సొంత కేడర్ నుంచి సహాయ నిరాకరణ చేస్తున్నారు. కేసీఆర్ ప్రధాన అనుచరునిగా చారికి గుర్తింపు ఉంది. పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి కేటీఆర్ మిత్రునిగా.. కేసీఆర్ ఫ్యామి లీకి దగ్గరి మనిషిగా ఉన్నారు. కొంతకాలంగా జనగామ నియోజకవర్గం నుంచి అతని పేరు వినపడుతోంది. బయటకు అలాంటిది ఏంలేదని చెబుతున్నా.. అడుగులు మాత్రం కనపడుతున్నాయి. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍తో విభేదాలున్నాయి. వీరి కేడర్ ఎన్నోసార్లు ఫైటింగ్‍కు దిగారు. హుజూరాబాద్‍లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పొలిటికల్ ఫైట్ చేస్తున్న కౌశిక్‍రెడ్డి వచ్చే ఎలక్షన్లో తానే బీఆర్‍ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో రాజేందర్‍పై పోటీ చేసిన కేయూ ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‍కు కాకుండా టిక్కెట్ తనకే వస్తుందని ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వార్ నడుస్తోంది.
మిగతా జిల్లాల్లోనూ ఇదే సీన్..
సీఎం కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తు న్నారు. ఇదివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఆయన ప్రస్తుతం మెదక్ దగ్గర్లోని తన స్వగ్రామం కూచన్ పల్లిలోని ఫామ్ హౌజ్‌లో ఎక్కువగా ఉంటున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు, వేడుకలకు హాజరవుతూ.. అవసరమైనవారికి సాయం అందిస్తూ తాను పోటీలో ఉంటానని చెప్పకనే చెప్తున్నారు. 2018లో వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పైలెట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య నిత్యం పోరు నడుస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి తన కొడుకు డాక్టర్ రాజేశ్‌రెడ్డిని పోటీకి దింపాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రాజేశ్ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. తిమ్మాజీపేట్, బిజినేపల్లి మండలాల్లో పర్యటన పూర్తి చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ రాకపోతే బీజేపీ, కాంగ్రెస్ నుంచైనా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి, కూచుకుళ్లకు మధ్య మొదటి నుంచి విభేదాలున్నాయి. కేటీఆర్ వర్గంగా చెప్పుకునే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నారాయణ రెడ్డి ఆ ఎన్నికల్లోనే ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. వారిద్దరూ అధికారిక వేదికలమీదే మాటకు మాట అనుకుంటున్నారు.
నోముల భగత్, ఎంసీ కోటిరెడ్డి మధ్య విభేదాలు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మధ్య విభేదాలు ముదిరిపోయాయి. దీంతో రెండు వర్గాలు చీలిపోయి వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో సహా, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ జోక్యం పెరిగిపోవడంతో ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది. మొత్తం మీద ఎమ్మెల్సీలు తమ టికెట్లకు ఎసరు పెడ్తుండడంతో సిట్టింగులు అలర్ట్ అవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లడంతోపాటు క్యాడర్‌ను తమవైపు తిప్పుకోవడం ద్వారా సీట్లను కాపాడుకునే పనిలో ఉన్నారు.
పల్లా - దాస్యం మధ్య కోల్డ్ వార్
కేసీఆర్ మనిషిగా పల్లా రాజేశ్వర్‍రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా హనుమకొండ బాలసముద్రంలో అతిపెద్ద బిల్డింగ్ కట్టారు. లోకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‍కు పార్టీ పెద్దల వద్ద మంచిపేరే ఉంది. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారితే గ్రేటర్ వరంగల్ సిటీ నుంచి అవకాశాన్ని వదులుకోవద్దని పల్లా రాజేశ్వర్‍రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.