ఓటమి భయంతో కేసీఆర్​కు నిద్రపడ్తలేదు

నల్గొండ, వెలుగు:మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. త్వరలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం మునుగోడులో రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ప్రారంభించారు. మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి కొత్తగా ఏర్పడ్డ గట్టుప్పల్ మండల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలు నియోజకవర్గంలో వేడిపుట్టిస్తున్నాయి. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని జగదీశ్​అనగా.. తన రాజీనామా వల్లే సీఎంతో సహా, జగదీశ్​లాంటి మంత్రులు మునుగోడుకు వస్తున్నరని, స్కీంలు ఇస్తున్నరని రాజగోపాల్ కౌంటర్ ఇచ్చారు. మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేయలేక పోయిన రాజగోపాల్ బీజేపీలో చేరి ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని మంత్రి సవాల్​ విసిరారు. ‘‘మునుగోడు అభివృద్ధి కోసం అసెంబ్లీలో ప్రస్తావించినా, సీఎం అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదు. కానీ నా రాజీనామాతో దిగొచ్చిన సర్కార్ ఇప్పుడు గొర్రెలు, దళితబంధు, చేనేత బంధు, గిరిజన బంధు, పింఛన్లు, రేషన్​షాపులు, రోడ్లకు ఫండ్స్ ఇస్తున్నది. ఫామ్​హౌస్​పడుకున్న సీఎంను మునుగోడు రప్పించిన ఘనత నాకు దక్కింది” అని రాజగోపాల్ అన్నారు.

కేసీఆర్​ను కాపాడుకునే బాధ్యత ప్రజలదే: జగదీశ్​

మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కుటుంబ బాగు కోసమే వచ్చింది తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని మంత్రి జగదీశ్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే రైతుల మోటార్లకు మీటర్లు తప్పవని దీనికి గుజరాత్ ప్రభుత్వమే నిదర్శనమని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమం కావాలో సంక్షోభం కావాలో తేల్చుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. దేశమంతా మునుగోడు వైపే చూస్తోందని, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని, మోడీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదన్నారు.

సీఎం కేసీఆర్ రోజంతా మునుగోడు గురించే ఆలోచిస్తున్నారని రాజగోపాల్ అన్నారు. ‘‘అవినీతి సొమ్ముతో, అధికార బలంతో లక్ష మంది పోలీసులను తీసుకొచ్చి పెట్టినా కేసీఆర్ కు ఓటమి తప్పదు.. ఇక్కడ గెలిచేది మునుగోడు ప్రజల ఆత్మగౌరవం. మూడున్నరేండ్లుగా ప్రజలకు ఏమీ చేయలేదన్న నిరాశతో రాజీనామా చేశా. దాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేలా నిస్వార్థంగా, నిర్భయంగా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. పోలీసులు ఏం చేయలేరు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వాటికి తలొగ్గరు” అని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడుకు రూ.2 వేల కోట్లు ఇస్తామంటే ఎప్పుడో రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ ఇక్కడి ప్రజలను అవమానపరిచి నందుకు నిరసనగా మునుగోడు అంటే ఎంటో నిరూపించేందుకు ఇప్పుడు రాజీనామా చేశానని చెప్పారు.