
సర్పంచ్ దూషించాడని కాలర్ పట్టిన వార్డు మెంబర్
పర్వతగిరి, వెలుగు : తనను బూతులు తిట్టాడని ఓ వార్డుమెంబర్ సర్పంచ్కాలర్ పట్టి నిలదీసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండా ఉప సర్పంచ్ పీర్యా సంతకాన్ని ఫోర్జరీ చేసి స్థానిక సర్పంచ్ ఇస్లావత్ రమేశ్ డబ్బులు డ్రా చేశారని వరంగల్ డీపీవోకు ఫిర్యాదు చేశారు. గురువారం ఈ విషయమై ఎంపీవో పాక శ్రీనివాస్ గ్రామపంచాయతీ ఆఫీస్లో ఎంక్వైరీ నిర్వహించారు. ఎంపీవో శ్రీనివాస్ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ వాంగ్మూలం నమోదు చేసుకుంటుండగా సర్పంచ్ రమేశ్ వార్డు మెంబర్ సావిత్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె ఆవేశంతో రమేశ్ గల్లాపట్టుకుని నిలదీసింది.
సావిత్రి గతంలో ఉపసర్పంచ్ గా పనిచేసింది. ఆ టైంలో వారి మధ్య ఉన్న ఇదే తరహా వివాదంతో రమేశ్ ఆమెను తిట్టినట్టు తెలిసింది. కాగా, ఇద్దరిని సముదాయించి ఎంపీవో ఎంక్వైరీ పూర్తి చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలలో రూ.81వేలు, 95వేలు రెండు చెక్కులు సర్పంచ్ రమేశ్, ఉపసర్పంచ్ పీర్యా సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేశారని తేలిందని, ఈ విషయాన్ని పై ఆఫీసర్లకు రిపోర్ట్ పంపిస్తానని వెళ్లిపోయారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ వర్గీయులు జీపీ ఆఫీస్ బయట ఒకరినొకరు దూషించుకుంటూ కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు.