శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం

హైదరాబాద్: మహిళల అండర్‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్‌‌ స్టార్ ఫర్ఫామర్, తెలుగు మహిళ క్రికెటర్ గొంగడి త్రిషకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. మలేషియా వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ముగియడంతో భారత జట్టులోని తెలుగు ప్లేయర్స్ త్రిష, ద్రితి మంగళవారం (ఫిబ్రవరి 4) స్వస్థలానికి చేరుకున్నారు. మలేషియా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వరల్డ్ కప్ విన్నింగ్ సభ్యులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు, క్రికెట్ అభిమానులు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రికెటర్ త్రిష మీడియాతో మాట్లాడారు. 

అండర్ 19 వరల్డ్ కప్‎లో  మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇకనుంచి మరింత కష్టపడి జాతీయ మహిళ క్రికెట్ జట్టులో చోటు సాధించడమే లక్ష్యంగా ముందుకు పోతానని తెలిపారు. వరల్డ్ లాంటి మెగా టోర్నీ అని ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదని.. ప్రతి మ్యాచ్లో మా పాత్ర ఏంటి అని మాత్రమే ఆలోచించామని చెప్పారు. 

జట్టు కూర్పులో భాగంగా ఈసారి ద్రితికి అవకాశం రాలేదు కానీ.. తను చాలా మంచి ప్లేయర్ అని సహచర ప్లేయర్‎ను కొనియాడింది త్రిష. ద్రితి కచ్చితంగా భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు. నా ప్రతి విజయంలో మా నాన్న ఉన్నారని.. అలాగే..  బీసీసీఐ, హెచ్సీఏ నుంచి పూర్తి మద్దతు లభించిందని పేర్కొన్నారు.నాకు సహకరించి.. నన్ను అభిమానించిన అందరి ధన్యవాదాలు తెలిపారు త్రిష. 

మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం యువతి గొంగడి త్రిషది కీలక పాత్ర. బ్యాట్, బాల్‎తో అద్భుతం చేసిన త్రిష.. భారత్‎కు రెండోసారి అండర్ 19 వరల్డ్ కప్ అందించింది. ఒక్క మ్యాచులోనే కాకుండా టోర్నీ మొత్తం తన అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది మన త్రిష. 

ముఖ్యంగా త్రిష చేసిన సెంచరీ ఈ టోర్నీలో హైలెట్. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌ వేదికగా మంగళవారం(జనవరి 28) స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిష సెంచరీతో చెలరేగింది. 53 బంతుల్లో వంద మార్క్ చేరుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 110 పరుగులు చేసింది. తద్వారా.. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది మన తెలుగమ్మాయి.