
న్యూఢిల్లీ, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా ఎన్నికై తొలిసారి ఢిల్లీ వెళ్లిన గడ్డం వంశీ కృష్ణకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొత్త ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి ఎంపీ వంశీకృష్ణ సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరిని వీ6- వెలుగు, విశాక ఎంప్లాయీస్ గజ మాలతో సత్కరించారు. బ్యాండు బాజాలతో రిసీవ్ చేసుకున్నారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి వివేక్, వంశీ అశోకా హోటల్లో జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ఇతర పార్టీ ముఖ్యనేతలకు వంశీని వివేక్ పరిచయం చేశారు. వంశీ కృష్ణ తొలిసారి లోక్ సభకు ఎన్నికైనందుకు ముఖ్యనేతలు అభినందించారు. తాత కాకా అడుగుజాడల్లో మనవడు వంశీ కృష్ణ రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కాంక్షించారు.