
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో వాటర్ హీటర్ పసివాడి ప్రాణాలు తీసింది. ఆడుకుంటూ వెళ్లి హీటర్ పెట్టిన నీళ్ల బకెట్లో పడి నాలుగేళ్ల చిన్నారి బన్నీ మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చిన్నారి బన్నీ తండ్రి నరసింహ మార్చి 24న తన కుటుంబంతో కలిసి బాలాజీ నగర్ హనుమాన్ దేవాలయం దగ్గర ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళగా అక్కడ ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే వేడి నీళ్లు కాస్తున్న హీటర్ బకెట్లో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా పడిపోయాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడు ఒళ్లంతా తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన స్థానికంగా ఉండే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read:-మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిన కారు..
ఈ ఘటనపై బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.