ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొట్టగొల్ల తుక్కప్ప(55) కూలి పని చేసుకుంటూ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈశ్వరమ్మకు శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో ప్రియుడితోనే ఉండేందుకు తుక్కప్పను అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం కోసం అంటూ కౌకూర్ దర్గా వద్దకు తీసుకెళ్లింది ఈశ్వరమ్మ. అయితే డాక్టర్ అందుబాటులో లేడని చెప్పి్ నమ్మించింది. తుక్కప్పకు మద్యం తాగే అలవాటు ఉండటంతో పక్కనే ఉన్న వైన్ షాప్ లో ఓసి కోటర్ కొంది ఈశ్వరమ్మ. . ప్రియుడు శ్రీనివాస్ ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్ లో పురుగుల మందు కొని ఈశ్వరమ్మకు ఇచ్చాడు.
పురుగులమందును ఓసి కోటర్ లో కలిపి తుక్కప్పకు తాగించింది ఈశ్వరమ్మ. అది తాగాక కాసేపటికి అపస్మారక స్థితిలోకి తుక్కప్ప వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కన ఉన్న వారితో భర్తను గాంధీ ఆసుపత్రికి తరలించింది ఈశ్వరమ్మ. అసుపత్రిలో చికిత్స పొందుతూ తుక్కప్ప చనిపోయాడు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ లో అసలు విషయం బయటపడటంతో ఈశ్వరమ్మను, ఆమె ప్రియుడు శ్రీనివాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.