వైరా, వెలుగు : అనుమానాస్పదంగా మృతి చెందిన భర్త డెడ్ బాడీతో నాలుగు రోజులుగా ఓ భార్య ఇంట్లోనే ఉండిపోయింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 20వ వార్డు మిట్టపల్లి రైస్ మిల్ సమీపంలో భోగి వీరభద్రం(65) నాలుగు రోజుల కింద అనుమానాస్పదంగా మృతి చెందాడు. వీరభద్రం రైల్వేలో గ్యాంగ్ మన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. భార్య మంగమ్మకు కొన్నేండ్ల నుంచి మతిస్థిమితం లేదు. వీరభద్రం కొడుకు వెంకటకృష్ణ ఖమ్మంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఎస్ డీఈ గా పనిచేస్తున్నారు.
ప్రతీ రోజు వెంకటకృష్ణ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడు. ఈనెల 6న సాయంత్రం 4 గంటల సమయంలో కూడా వెంకటకృష్ణ తన తండ్రి వీరభద్రంతో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవటంతో అనుమానం వచ్చింది. వెంకటకృష్ణ వైరాలోని ఇంటికి వచ్చారు. ఇంట్లో తన తండ్రి కుళ్లిన డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. మంచంపై ఉన్న డెడ్‌బాడీపై భార్య మంగమ్మ ఉప్పు, బియ్యం పోసింది. ఈ విషయం తెలుసుకున్న కొనిజర్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేశారు. తన తండ్రి అనారో గ్యంతో చనిపోయి ఉంటాడని, ఎవరిపై అనుమానాలు లేవని వెంకటకృష్ణ ఫిర్యాదు చేశాడు.