భర్త బతికుండగానే వితంతు పింఛన్

భర్త బతికుండగానే వితంతు పింఛన్
  • ఐదేండ్ల తరువాత తిరిగి చెల్లించాలని నోటీసులు

అయిజ, వెలుగు : భర్త బతికుండగానే భార్య వితంతు పింఛన్  తీసుకోవడంతో పాటు భర్త వృద్ధాప్య పింఛన్ తీసుకున్న విషయం జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన సుంకర వేణప్ప, భార్య సుంకర ధనలక్ష్మి 2015లో వృద్ధాప్య పింఛన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల తప్పిదంతో అప్పట్లో ఆమెకు వితంతు పింఛన్ మంజూరైంది. అదే క్రమంలో భర్త వేణప్పకు వృద్ధాప్య పెన్షన్  మంజూరైంది. 2015 నుంచి 2020 వరకు ధనలక్ష్మి వితంతు పింఛన్  తీసుకుంది.

2020లో అధికారులు చేసిన తనిఖీల్లో విషయం బయటపడడంతో ఆమె పేరును జాబితా నుంచి  తొలగించి పింఛన్ నిలిపేశారు. ఇదిలాఉంటే నెలకు రూ.2 వేల చొప్పున ఐదేండ్లు తీసుకున్న రూ.1.20 లక్షల పింఛన్​ డబ్బులను తిరిగి చెల్లించాలని మున్సిపల్ ఆఫీసర్లు ఆమెకు అప్పట్లో నోటీసులు జారీ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని, ఇప్పట్లో చెల్లించలేనని ధనలక్ష్మి అధికారులకు తెలిపింది.

ఆ డబ్బులు నేటి వరకు చెల్లించకపోవడంతో తాజాగా మున్సిపల్  కమిషనర్  సత్యబాబు సోమవారం మరోసారి ఆమెకు నోటీసులు పంపించారు. డబ్బులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.