సుపారీ ఇచ్చి భర్త కడతేర్చిన భార్య

  • సిద్దిపేట వన్ టౌన్​లో ఆలస్యంగా ఘటన

సిద్దిపేట రూరల్, వెలుగు :  కట్టుకున్నోడు ట్రాన్స్ జెండర్ గా మారి తన పరువు తీస్తున్నాడని అతడిని చంపించింది ఓ భార్య. సిద్దిపేట వన్ టౌన్  పోలీస్ స్టేషన్  పరిధిలో గత నెల 11న జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్  సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని బోయిగల్లి కాలనీకి చెందిన వేదశ్రీకి 2014 లో నాసర్ పురకి చెందిన దరిపల్లి వెంకటేశ్​ తో పెండ్లయింది. 2015లో వారికి ఒక పాప పుట్టింది. ఆ తర్వాత వెంకటేశ్  అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తర్వాత ట్రాన్స్ జెండర్​గా మారి చీర కట్టుకొని తిరుగుతూ తన భార్య ఎక్కడికెళ్తే అక్కడి చప్పట్లు కొడుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

తన పరువు తీస్తున్నాడన్న కోపంతో భర్తను ఎలాగైనా చంపాలని వేదశ్రీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని కాకతీయ ఫుట్ వేర్  షాపు ఓనర్  రమేశ్ తో రూ.18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని  రూ.4,60,000 సుపారీ ఇచ్చింది. పథకం ప్రకారం డిసెంబర్ 11న నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఇప్పల శేఖర్  సాయంతో భర్త వెంకటేశ్​ కు బీర్   తాగించారు. అతను నిద్రపోయిన తర్వాత ముఖంపై దిండు పెట్టి ఉపిరాడకుండా చంపేశారు. వెంకటేశ్  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం వేదశ్రీని, ఆమెకు సహకరించిన రమేశ్, శేఖర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.