కోడలిపై అత్త యాసిడ్ దాడి

ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఓ మహిళ తన కోడలిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో నిందితురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. 25 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని జేపీసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం లోక్​ నాయక్​ జై ప్రకాశ్​ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది. ఈ సంఘటన న్యూ ఉస్మాన్‌పూర్‌లో జరిగింది.

అసలేం జరిగింది..? 

ఉస్మాన్​పూర్​లోని ఓ ఇంట్లో నిందితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. కింద ఫ్లోర్​లో అత్త,మామ ఉంటున్నారు. రెండో అంతస్తులో కోడలు, కుమారుడు ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కర్కర్​దోమా కోర్టులో ఓ కేసు కూడా నడుస్తోంది. సెప్టెంబర్​ 20న అందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అత్త అంజలి కోపంతో కోడలిపై యాసిడ్ దాడి చేసింది. 


ఇంట్లో ఉన్న కోడలి దగ్గరకు వెళ్లి.. ఆమెపై యాసిడ్​ పోసింది.ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. కోడలిపై యాసిడ్ పోసిన తర్వాత అత్త మామలు ఇంటి నుంచి పారిపోయారు. బురారీలోని సంత్ నగర్ ప్రాంతంలో తెలిసిన వారి ఇంట్లో ఆశ్రయం పొందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. 

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితులపై న్యూ ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు ఈ అంశంపై చర్య తీసుకున్న నివేదికను పోలీసులను కోరింది. నిందితురాలి కుమారుడితో రెండేళ్ల క్రితం బాధితురాలికి వివాహం అయ్యింది. ఈమెకు ఆరు నెలల కుమార్తె కూడా ఉంది.