ఫంక్షన్​లో చుట్టాలను తిట్టిందని తల్లిని కొట్టిచంపిన బిడ్డ

ఫంక్షన్​లో చుట్టాలను తిట్టిందని తల్లిని కొట్టిచంపిన బిడ్డ
కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు 
నిజామాబాద్ జిల్లా ఉమ్మెడలో దారుణం

నందిపేట, వెలుగు : ఇంటికొచ్చిన చుట్టాలను తిట్టి పరువు తీసిందన్న కోపంతో ఓ మహిళ తన తల్లినే రోకలి బండతో కొట్టి చంపింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భర్త 20 ఏండ్ల కింద చనిపోయాడు. పెద్ద బిడ్డ హరితకు పెండ్లి కాలేదు. తల్లి ఉంటున్న ఇంటిలోనే మరొక గదిలో  ఉంటోంది. చిన్న బిడ్డ అరుణను తల్వేద గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశారు. నర్సుకు, పెద్ద బిడ్డకు ఒకరంటే మరొకరికి పడేది కాదు. చిన్న బిడ్డ అరుణకు పాప పుట్టడంతో శుక్రవారం తొట్లె కార్యక్రమం చేశారు.

తొట్లెకు చుట్టాలు వచ్చారు. అయితే, తినిపోవడానికి వచ్చారంటూ చుట్టాలను హేళన చేస్తూ నర్సు తిట్టింది. చుట్టాల ముందు తమ పరువు పోయిందని హరిత కోపంతో ఊగిపోయింది. అందరూ వెళ్లిపోయాక రోకలిబండతో తల్లిని తీవ్రంగా కొట్టింది.  శనివారం సాయంత్రం అయినా తల్లి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హరిత చెల్లి అరుణకు, ఇతర చుట్టాలకు ఫోన్ ​చేసి విషయం చెప్పింది. వారంతా వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నర్సు చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.