మహిళ ఫోన్ కాల్.. ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ

మహిళ ఫోన్ కాల్.. ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ
  • అప్పుల బాధ తాళలేక పిల్లలతో సహా ఆత్మహత్యకు ఓ మహిళ నిర్ణయం
  • విషయాన్ని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కు ఫోన్ చేసి చెప్పిన మహిళ
  • స్పందించిన ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్... రూ.2 లక్షల సాయం, పిల్లల చదువుకు భరోసా

వికారాబాద్: ఆరేళ్ల క్రితం  భర్త చనిపోయాడు. దీంతో ఆ ఇల్లాలికి  కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి కూలీ పని చేస్తూ ముగ్గురు పిల్లల బాగోగులు చూసుకుంటోంది. కానీ భర్త చేసిన అప్పులు ఆమె పాలిట శాపంగా మారాయి. రోజూ అప్పులోళ్లు తమ బాకీ తీర్చాలంటూ వేధిస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాలేదామెకు. దీంతో తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. ఇదే విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ సంస్థ అధ్యక్షుడు... ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించడంతో పాటు ముగ్గురు పిల్లలను చదివిస్తామంటూ ముందుకొచ్చారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్  జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గ్రామానికి చెందిన వరమ్మ తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. 2016లో అప్పుల బాధతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ భారమంతా వరమ్మపైనే పడింది. అప్పటి నుంచి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. అయితే భర్త చేసిన అప్పులు పెరిగిపోతుండటం... నిత్యం అప్పులోళ్లు వేధిస్తుండటం ఆమెను తీవ్ర మనో వేధనకు గురి చేశాయి. దెబ్బ మీద దెబ్బన్నట్లు ఉన్న చిన్న ఇల్లు  కాస్తా ఇటీవల కురిసిన వర్షాలకు డ్యామేజ్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో తనను ఆదుకోవాలంటూ వరమ్మ ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసి వేడుకుంది. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది.

చివరి ప్రయత్నంగా ఆ మహిళ ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ నిర్వాహకులకు ఫోన్ చేసింది. అప్పులతో బతుకు భారంగా మారిందని, తన ముగ్గురు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని తన గోడు వివరించింది. అప్పు కింద ఉన్న కొంత పొలాన్ని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె గోడు విన్న ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రాధర్ గౌడ్.. ఆ మహిళకు భరోసా కల్పించారు. ఆత్మహత్యకు పాల్పడవద్దని... కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నేరుగా మహిళ ఇంటికి వచ్చి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లల పైచదువుల కోసం కూడా సహకారం అందజేస్తామని భరోసా కల్పించారు. ఇక వరమ్మ మాట్లాడుతూ... కష్ట కాలంలో ఆదుకున్న ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది. తాను, తన పిల్లలు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొంది.