మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడిపై మహిళ ఫిర్యాదు

జగిత్యాల, వెలుగు : మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ అనుచరుడితో తనకు ప్రాణభయం ఉందని అనూష అనే మహిళ సోమవారం జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మకరంద్‌కు ఫిర్యాదు చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన పీఎసీఎస్​చైర్మన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడు మంత్రి వేణు జగిత్యాల విద్యానగర్‌లోని తన ఇంటి పక్క ల్యాండ్ కొన్నారని మహిళ తెలిపింది. అతడి స్థలానికి ఈశాన్యంలో తన ఇల్లు ఉండడంతో దానిని కూలిస్తే వాస్తు ప్రకారం కలిసి వస్తుందని భావిస్తూ అర్ధరాత్రి టైంలో తన ఇంటి ప్రహరీని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అనూష ఆఫీసర్లను కోరారు.