ప్రభుత్వ దవాఖాన టాయిలెట్​లో డెలివరీ

నల్లగొండ, వెలుగు : నల్లగొండ జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ దవాఖాన టాయిలెట్​లో  బుధవారం సాయంత్రం ఓ మహిళ డెలివరీ అయ్యింది. నిడమనూరు మండల ధర్మాపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ మూడు రోజుల క్రితం పురిటినొప్పులతో హాస్పిటల్​లో చేరింది.  మొదటి సంతానం నార్మల్ ​డెలివరీ అయ్యిందని, ఇది కూడా సాధారణ కాన్పే అవుతుందని డాక్టర్లు పార్వతమ్మకు, ఆమె బంధువులకు చెప్పారు. దానికి కూడా మరో వారం టైం ఉందని బుధవారం ఇంటికి వెళ్లిపొమ్మన్నారు. వారు  చెప్పిన కొద్దిసేపటికే పార్వతమ్మ  టాయిలెట్​కు వెళ్లగా నొప్పులు మొదలై అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది.

వెంటనే బంధువులు డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో అప్పుటికప్పుడు అక్కడికి వచ్చి బాబును ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం బాబుతో పాటు తల్లికి కూడా చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చునాయక్ బుధవారం రాత్రి మాతాశిశు కేంద్రంలోని వార్డుకు వచ్చారు. ఈ ఘటనపై ఆయనను వివరణ కోరగా ఏం జరిగిందన్న దానిపై విచారణ జరిపిస్తామని, ప్రస్తుతం తల్లికి, బిడ్డకు చికిత్స కొనసాగుతోందన్నారు.