Kanpur: ఎంత ఘోరం.. స్కూటీపై 12 ఏళ్ల కూతురితో వెళ్తుండగా.. షాకింగ్ వీడియో..

Kanpur: ఎంత ఘోరం.. స్కూటీపై 12 ఏళ్ల కూతురితో వెళ్తుండగా.. షాకింగ్ వీడియో..

కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలుడు సరదా కోసం చేసిన కారు స్టంట్ ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. తల్లితో కలిసి స్కూటీపై వెళుతున్న 12 ఏళ్ల బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాన్పూర్లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. 

శనివారం ఉదయం నుంచి ఈ వీడియో ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం గమనార్హం. కారు అతి వేగంగా డ్రైవ్ చేస్తూ స్టంట్స్ చేయడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఆ కారు తగిలిన వేగానికి స్కూటీపై వస్తున్న ఆ తల్లీకూతురు 30 అడుగుల దూరంలో వెళ్లి పడ్డారు. వారిద్దరినీ గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 

స్కూటీ నడుపుతున్న మహిళ హెల్మెట్ ధరించినప్పటికీ ఆ కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంగా ఢీ కొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళ 12 ఏళ్ల తన కూతురితో కలిసి క్లినిక్కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ కారులో నలుగురు మైనర్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు తెలిసింది. 

వీరంతా స్కూల్ ఎగ్గొట్టి కారుతో స్టంట్స్ చేసినట్లు తేలింది. స్కూల్ యూనిఫాం అదే కారులో మార్చుకుని రెగ్యులర్ క్లాత్స్ వేసుకున్నట్లు కారులో దొరికిన నలుగురి స్కూల్ యూనిఫామ్స్ చూశాక తెలిసింది. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన మైనర్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.