మోమోస్​ తిని మహిళ మృతి.. 70 మందికి అస్వస్థత..

మోమోస్​ తిని మహిళ మృతి.. 70 మందికి అస్వస్థత..
  • పలువురి పరిస్థితి విషమం.. బాధితుల్లో చిన్నారులు
  • సిటీలోని పలు హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్
  • వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులు
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • శాంపిల్స్​ను టెస్ట్ కోసం ల్యాబ్​కు పంపిన అధికారులు
  • మయోనీస్​​ కల్తీ అయి ఉండొచ్చని అనుమానం

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట/పద్మారావునగర్, వెలుగు: చికెన్ మోమోస్ తిని ఓ మహిళ చనిపోయింది. మరో 70 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్​లోని నందినగర్​లో చోటు చేసుకున్నది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నందినగర్, సింగాడికుంట బస్తీలో ప్రతి శుక్రవారం వారాంతపు సంత జరుగుతుంది. 

సంతలో సాజిద్, రజిక్, ఫారూఖ్ కలిసి మోమోస్ అమ్ముతుంటారు. సింగాడికుంటకు చెందిన రేష్మ బేగం (31) తన ముగ్గురు పిల్లలతో కలిసి సంతకు వెళ్లింది. మోమోస్​తో మయోనీస్ కలిపి తిన్నది. కొద్దిసేపటికే ఆమెకు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం చనిపోయింది. మోమోస్ తిన్న నందినగర్​కు చెందిన శివానీ, సీతతో పాటు మొత్తం 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా శ్రీనగర్ కాలనీలోని తన్వీర్, ఎర్రగడ్డలోని ఈఎస్ఐ, అపోలో జనరల్ హాస్పిటల్, నిమ్స్ తో పాటు పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మోమోస్​తో మయోనీస్ కలిపి తిన్నవాళ్లంతా అస్వస్థతకు గురయ్యారు. మోమోస్ అమ్మిన ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

శాంపిల్స్​ను ల్యాబ్​కు పంపిన అధికారులు

చింతల్ బస్తీలో ‘హైదరాబాద్ వావ్ హాట్ మోమోస్’, ‘ఢిల్లీ హాట్ మోమోస్’ పేరుతో ఎలాంటి అనుమతుల్లేకుండా మోమోస్ తయారు చేసి సిటీలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. వారాంతపు సంతలు, ట్యాంక్​బండ్ తదితర ప్రాంతాల్లోనూ అమ్ముతున్నారు. చింతల్​బస్తీలోని తయారీ కేంద్రాన్ని సీజ్ చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారి చంద్రకాంత్ తెలిపారు. అపరిశుభ్రంగా మోమోస్ తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మోమోస్ తయారీకి ఉపయోగించిన ఆహార పదార్థాల శాంపిల్స్​ను టెస్ట్ కోసం ల్యాబ్​కు పంపించినట్లు తెలిపారు. మోమోస్ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచిస్తామన్నారు. 

బన్సీలాల్​పేటలో ఐదుగురికి అస్వస్థత

సికింద్రాబాద్ బన్సీలాల్​పేట డివిజన్ పరిధిలో మోమోస్ తిన్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల కింద సెక్రటేరియెట్ సమీపంలోని ఫుడ్​స్టాల్​లో బన్సీలాల్​పేటకు చెందిన వినయ్ (33), దీప్తి(30), మితేశ్​(19), షణ్ముకప్రియ (16), తన్విత శ్రీయ(13) చికెన్ మోమోస్ తిన్నారు. మరుసటి రోజు వీళ్లంతా కడుపునొప్పి, విరేచనాలతో పద్మారావునగర్​లోని ప్రైవేట్ హాస్పిటల్​లో చేరారు. రెండ్రోజులు ట్రీట్​మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ అస్వస్థతకు గురవడంతో సోమవారం కవాడిగూడలోని మరో హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యారు. 

మయోనీస్ కల్తీ అయిండొచ్చనే అనుమానం!

మోమోస్​తో పాటు మయోనీస్ కలిపి తిన్నవాళ్లే అస్వస్థతకు గురికావడం అనుమానాలకు తావిస్తున్నది. నెల రోజుల కింద అల్వాల్​లోని షవర్మా సెంటర్​లో మయోనీస్​ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. నందినగర్​లో జరిగిన ఘటనలోనూ మయోనీస్ కల్తీ అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఇస్తున్న ఎగ్ మయోనీస్ ను సాస్​లా ఉపయోగిస్తుంటారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్​లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసుల్లో ఎక్కువగా ఈ తరహావే ఉన్నట్లు సమాచారం. ఎగ్ మయోనీస్​లో కలర్, టేస్ట్ కోసం ప్రమాదకరమైన కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. దీంతో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటదని డాక్టర్లు చెప్తున్నారు. నందినగర్ ఘటన విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర నగర్ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.