ప్రపంచంలోని యువతీయువకులు ఫ్యాషన్‌పైనే ఆధారపడి ఉన్నారు. రకరకాల బట్టలు, షూస్, చెప్పులు మొదలైనవాటిని ధరిస్తుంటారు. మోడల్స్ వింత దుస్తులతో క్యాట్‌వాక్ పై నడుస్తూ ఉంటారు. చాలా సార్లు ఫ్యాషన్ కోసం వింత హైహీల్స్ కూడా ధరిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి ఓ రకం హై హీల్స్ ను ధరించి కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇదేం ఫ్యాషన్ రా నాయనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలుకల బోను (Rat cage) ఎందుకు ఉపయోగిస్తారని మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు? ఎలుకలను పట్టడానికి ఉపయోగిస్తారని చెబుతారు. ఎలుకల బోనుతో మరో ఉపయోగం కూడా ఉందని తాజాగా ఓ మోడల్ నిరూపించింది. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఏదీ అనర్హం కాదు. దేనితోనైనా ప్రయోగాలు చేసి అదే కొత్త ఫ్యాషన్ అనే వాళ్లు కోకొల్లలుగా ఉంటారు. ప్రస్తుతం ఎలుకల బోనుతో చేసిన హైహీల్స్ షూ చర్చనీయాంశంగా మారింది (Rat cage Shoe).
ఆ హీల్స్ ని చూసిన ప్రతి ఒక్కరు ఔరా అని అబ్బురపోయి ముక్కున వేలేసుకున్నారు. వీడియోలో అమ్మాయి వేసుకున్న బూట్, దాని పై భాగం సాధారణ షూ లా కనిపిస్తుంది. కానీ దాని దిగువ భాగం పంజరంలా ఉంటుంది. అందులో జీవించి ఉన్న ఎలుకలను కూడా లాక్ చేసి ఉంచింది. ఇలాంటి హీల్స్ ను ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు కదా. ఇంత వింత హైహీల్స్ వేసుకుని అమ్మాయి ఎలా నడుస్తుందో అని ఆశ్చర్యం వేస్తుంది.
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ షోలలో ఒకటైన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ (New York Fashion Week) సందర్భంగా, ఎలుక బోనును వెరైటీగా ఉపయోగించారు. inmyseams అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన వీడియోలో ఓ మోడల్ ఎలుకల బోనును షూగా ఉపయోగించింది. ఆ మహిళ వేసుకున్న షూ కింద ఎలుకల బోను ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను కోట్ల మంది వీక్షించారు. 22 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో ఎలుకలను వేధిస్తున్నారు....ఇంత కంటే మంచి ఆలోచన రాలేదా... వెరీ ఫన్నీ...పిల్లులు చుట్టుపక్కల లేకుండా చూసుకోండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.