హైదరాబాద్ లేడీస్ హాస్టల్లో షాకింగ్ ఘటన.. హాస్టల్‌‌ బిల్డింగ్‌‌ ఓనర్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ దారుణం

హైదరాబాద్ లేడీస్ హాస్టల్లో షాకింగ్ ఘటన.. హాస్టల్‌‌ బిల్డింగ్‌‌ ఓనర్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ దారుణం
  • రంగారెడ్డి జిల్లా మంగళ్‌‌పల్లిలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓ ప్రైవేటు హాస్టల్‌‌లో ఉంటూ ఇంజినీరింగ్‌‌ చదువుతున్న విద్యార్థిని (18)పై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌‌పల్లి గేట్‌‌ సమీపంలోని దినకర గర్ల్స్‌‌ హాస్టల్‌‌లో జరిగింది. మంగళ్‌‌పల్లిలోని హాస్టల్‌‌లో ఉంటూ అదే ఏరియాలోని ఓ ఇంజినీరింగ్‌‌ కాలేజీ ఆ విద్యార్థిని ఫస్టియర్‌‌‌‌ చదువుతున్నది. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వెళ్లిన ఆమె.. గురువారం ఎగ్జామ్‌‌ ఉండడంతో బుధవారం మధ్యాహ్నం హాస్టల్‌‌కు తిరిగి వచ్చింది. హాస్టల్‌‌లో ఆ రోజు ఐదుగురు మాత్రమే ఉన్నారు.

ఈ విద్యార్థి తన రూంలో ఒక్కతే ఉంది. అయితే, ఆ రోజు రాత్రి హాస్టల్‌‌ బిల్డింగ్‌‌ ఓనర్‌‌‌‌ బంధువుల్లో ఒకరు అదే భవనం టెర్రస్‌‌పై బర్త్‌‌ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌‌లో హాస్టల్ బిల్డింగ్ యజమానికి డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్న నల్గొండ జిల్లా చింత గ్రామానికి చెందిన అక్కనబోయిన అజిత్ (22) పాల్గొన్నాడు. ఈ క్రమంలో హాస్టల్‌‌లో అమ్మాయిలు కొంతమందే ఉండటాన్ని గమనించాడు. తర్వాత అర్ధరాత్రి 1 గంట దాటాక ఒంటరిగా ఉన్న అమ్మాయి రూమ్‌‌లోకి నిందితుడి చొరబడి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

యువతి కేకలు వేయడంతో పక్క రూమ్‌‌లో విద్యార్థినులు వచ్చి, రూమ్‌‌ డోర్‌‌‌‌ను బయట నుంచి లాక్‌‌ చేసి పోలీసులకు ఫోన్‌‌ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్‌‌ను వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు.