కూతురిని వేధిస్తున్నాడని... అల్లుడిని హత్య చేసిన అత్త

కూతురిని వేధిస్తున్నాడని... అల్లుడిని హత్య చేసిన అత్త

నారాయణ్‌‌ఖేడ్‌‌, వెలుగు: కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి అల్లుడిని హత్య చేసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేఢ్‌‌లో గురువారం ఘటన జరుగగా శనివారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నారాయణఖేడ్‌‌ సీఐ శ్రీనివాస్‌‌ రెడ్డి, ఎస్సై విద్యాచరణ్‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నారాయణఖేడ్‌‌ మండల పరిధిలోని సంజీవరావ్‌‌పేటకు చెందిన లావణ్యకు, నర్సాపూర్‌‌ గ్రామానికి చెందిన మహేశ్‌‌ (32)తో పదేండ్ల కింద పెండ్లి జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన మహేశ్‌‌.. భార్య లావణ్యను నిత్యం వేధించేవాడు. దీంతో పాటు తన తండ్రి చనిపోగా వచ్చిన డబ్బులను దుబారా చేయడంతో పాటు, ఉన్న రెండు ఎకరాలను సైతం అమ్ముతానని చెప్పేవాడు. దీంతో లావణ్య తన ముగ్గురు పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది.

కూతురిని వేధిస్తున్న అల్లుడిని ఎలాగైనా చంపేయాలని లావణ్య తల్లి వీరమణి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తనకు తెలిసిన కిష్టయ్య అనే వ్యక్తితో కలిసి మహేశ్‌‌ను గురువారం బైక్‌‌పై పట్టణ శివారులోని మెట్రో డాబా దగ్గర గల చెరువు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. అతడు మత్తులోకి వెళ్లగానే బండ రాయితో మోది హత్య చేశారు. అనంతరం వీరమణి, కిష్టయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రోడ్డు పక్కన డెడ్‌‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎంక్వైరీ చేస్తున్న టైంలో మహేశ్‌‌ అత్త వీరమణిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వీరమణితో పాటు ఆమెకు సహకరించిన కిష్టయ్యను సైతం శనివారం సాయంత్రం అరెస్ట్‌‌ చేసినట్లు సీఐ, ఎస్సై తెలిపారు.