భారీ వర్షానికి నాలాలో పడి ..మహిళ మృతి

పద్మారావునగర్, వెలుగు:  సికింద్రాబాద్ లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఓ మహిళ నాలాలో కొట్టుకుపోయింది. దాదాపు అద్దగంటకు పైగా వర్షం కురవడంతో నాలాలు పొంగి ప్రవహించాయి. దూద్ బావి నాలా ప్రాంతంలో ఓ  మహిళ(45) వరద నీటిలో నడుస్తూ ముందుకు వెళ్లింది. అదుపు తప్పి నాలాలో పడిపోయింది. 

మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత స్థానికులతో కలిసి వెతికినా దొరకలేదు. నీటి ప్రవాహానికి దాదాపు నాలుగు కిలోమీటర్లు నాలాలో కొట్టుకుపోయిన మహిళ.. చివరికి వారాసిగూడ పీఎస్​పరిధిలోని అంబర్​నగర్​వద్ద విగతజీవిగా కనిపించింది.

స్థానికులు ఆమె​ మృతదేహాన్ని నాలా నుంచి బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. మహిళ వివరాలు తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వారాసిగూడ ఇన్​స్పెక్టర్​పి.శంకర్​ తెలిపారు. డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించారు.