
జగిత్యాల: నిన్న హోలీ వేడుకల సందర్భంగా జరిగిన కోడి గుడ్డు ఘర్షణ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. జగిత్యాల జిల్లాలో హోలీ వేడుకల్లో జరిగిన దాడిలో గాయపడిన జగిత్యాల మండలం తిప్పన్నపేటకు చెందిన రమ అనే మహిళ కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది. నిన్న హోలీ సందర్భంగా ప్రకాశ్ అనే వ్యక్తి విసిరిన కోడి గుడ్డు రమ ఇంట్లోకి వచ్చి పడింది.
దీంతో ఆమె కొడుకుకు ఆ యువకుడికి మధ్య గొడవ చెలరేగింది. ఈ క్రమంలో కొడుకుతో ఘర్షణకు దిగిన ప్రకాశ్ ను అడ్డుకునేందుకు రమ ప్రయత్నించింది. అయితే కోపంతో ఉన్న ప్రకాశ్ కొడవలితో మహిళ గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. గొంతు దగ్గర లోతుగా గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను చికిత్స కోసం కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఆమె మరణించింది. రమ కుటుంబంలో హోలీ వేడుక విషాదం నింపింది.