రెండేళ్లుగా కారులోనే నివాసముంటున్న మహిళ

  • హాస్టల్ ఫీజులు భరించలేక ఓ మహిళ కష్టాలు
  • కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
  • అక్కడి నుంచి వెళ్లనంటూ మహిళ పట్టు

హైదరాబాద్: ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. ఉండటానికి ఇళ్లు లేదు. కొంత కాలంపాటు ఓ ప్రైవేట్ హాస్టల్ లో బస చేసింది. కానీ కొన్ని నెలల తర్వాత చేతిలున్న డబ్బంతా ఖాళీ అయింది. ఫీజు చెల్లించకపోవడంతో హాస్టల్ నుంచి గెంటేశారు. దీంతో ఆమె జీవితం రోడ్డు పాలయింది. ఎక్కడ ఉండాలో అర్థంకాలేదామెకు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఉన్న ఓ పాడుబడ్డ కారును తన నివాసంగా మార్చుకొంది అనిత అనే ఓ మహిళ. రెండేళ్లుగా ఆ కారులోనే ఉంటోంది. ఎవరైనా స్థానికులు దయతలస్తే కడుపుకింత ఆహారం. లేదంటే పస్తులే. విచిత్రమేమిటంటే ఆమె నివాసం ఉంటున్న మారుతీ ఓమ్ని కారు (ఎ.పి.31క్యు-6434) ఆమెదేనని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదంతం మైత్రీవనం సమీపంలోని మధురానగర్ లో జరిగింది. 

కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనిత నివాసం ఉంటున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆమె నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ పేరు తప్ప వేరే విషయాలేవీ చెప్పడంలేదని పోలీసులు చెబుతున్నారు. మహిళకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు ఇలా కారులో ఉండటం శ్రేయస్కరం కాదని, స్టేట్‌హోంకు తరలించి ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. కానీ అనిత అందుకు అంగీకరించలేదని వారు చెబుతున్నారు. కాగా రూల్స్ కు విరుద్ధంగా కారును పార్కు చేసినందుకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చాలా ఫైన్లు వేశారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులు తెలిపారు. 

ఇవి కూడా చదవండి..

సికింద్రాబాద్ లో శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు దోపిడీ

ఎంబీబీఎస్ స్టూడెంట్కు వివేక్ వెంకటస్వామి నివాళి

ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్