- వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
- నలుగురు నిందితులు అరెస్ట్, పరారీలో మరొకరు
వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు : హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో వృద్ధురాలు గోనె సోమలక్ష్మి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో కుమారుడే తల్లిని హత్య చేశాడని పుకార్లు వ్యాపించినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. మంత్రాల నెపంతోనే ఐదుగురు సోమలక్ష్మిని హత్య చేశారని పోలీసులు తేల్చారు. డీసీపీ రవీందర్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గత నెల డిసెంబర్ 26న రాత్రి గోనె సోమలక్ష్మి తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో శవమై కనిపించింది. మద్యానికి బానిసైన కొడుకు సాయిలే తన తల్లిని చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. సోమలక్ష్మి చావుకు ఆమె కొడుకు సాయిలు కారణం కాదని, మంత్రాల నెపంతో గోనె రాజు, మరో నలుగురు కలిసి ఆమెను చంపేశారని పోలీసులు తెలిపారు.
డిసెంబర్ 12న గోనె రాజు కుమారుడు గోనె మధు చనిపోయాడు. సోమలక్ష్మి మంత్రాలు చేయడం వల్లే మధు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు అనుమానించారు. దాంతో ఆమెను చంపాలని పథకం పన్నారు. మరోవైపు మద్యం విషయంలో సోమలక్ష్మికి, ఆమె కుమారుడు సాయిలుకు రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఆమెను చంపి ఆ నెపాన్ని సాయిలుపై నెట్టేసి తప్పించుకోవాలని నిందితులు ప్లాన్ వేశారు.
ఈ క్రమంలో డిసెంబర్ 26న రాత్రి సోమలక్ష్మి ఇంటి ముందు నిద్రిస్తుండగా.. గోనె రాజు, అతని కుమారుడు అనిల్, బంధువులు యుగేందర్, ముస్కు రాజశేఖర్, అనుమల రంజిత్ కలిసి సోమలక్ష్మి తలపై బలంగా కొట్టి చంపేశారు. అనంతరం శవాన్ని మంచంపై పడుకోబెట్టి చద్దరు కప్పి వెళ్లిపోయారు. హత్య విషయంలో పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేసే సరికి అసలు విషయం బయట పడింది. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండుకు తరలించారు. మరో నిందితుడు అనుమల రంజిత్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు.