భూ సమస్యను పరిష్కరించాలంటూ సెల్ టవర్ ఎక్కిన మహిళ

జగిత్యాల జిల్లా : తమ భూ సమస్యను పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన యాచమనేని సత్యనారాయణ రావు, మమత దంపతులు. సత్యనారాయణ రావు తల్లి రామక్క పేరు మీద ఒక ఇల్లు, 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సత్యనారాయణ రావుకు ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. 

ఆరు నెలల క్రితం రామక్క చనిపోయింది. దీంతో రామాక్క ముగ్గురు కూతుళ్లు తల్లి ఆస్తిలో వాటా కోరుతూ సత్యనారాయణ దంపతులకు లీగల్ నోటీసులు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాచమనేని మమత.. ఇవాళ ఉదయం సెల్  టవర్ ఎక్కి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పబ్బ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భూ సమస్యను పరిష్కరిస్తామని ఎస్ఐ పబ్బ కిరణ్ హామీ ఇవ్వడంతో మమత టవర్ నుంచి కిందకు దిగింది.