
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ముందు సోమవారం ఓ మహిళ చంటి బిడ్డతో నిరసనకు దిగింది. భర్త వదిలేశాడని పోలీసులను ఆశ్రయిస్తే.. ఎస్సై సెటిల్మెంట్చేసి, డబ్బు ఇప్పిస్తామంటున్నాడని ఆరోపించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రేణుక, గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన సురేశ్ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత రేణుకకు అత్తింటి నుంచి వేధింపులు పెరిగాయి.
గర్భం దాల్చిన 7 నెలల తర్వాత సురేశ్ ఆమెను వదిలేశాడు. దీంతో కొన్నాళ్ల కింద రేణుక ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. కోలుకున్నాక బాధితురాలు ఉండవల్లి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోగా, ఉండవెల్లి ఎస్సై రూ.15లక్షలు ఇప్పిస్తాను, సురేశ్‌ను వదిలేయాలని చెప్పాడని రేణుక ఆరోపించింది. ఉండవెల్లి ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం ఎస్పీ ఆఫీసుకు వెళ్లి అడిషనల్ ఎస్పీ రవికి ఫిర్యాదు చేసింది. ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి, మాట్లాడాలని సూచించడంతో ఆమె సోమవారం సాయంత్రం స్టేషన్‌కు వెళ్లింది.
గతంలోనే కేసు నమోదు చేశాం..
బాధితురాలు రేణుక ఇచ్చిన ఫిర్యాదుతో గతంలోనే భర్త సురేశ్‌తోపాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని ఉండవల్లి ఎస్సై బాలరాజు తెలిపారు. రేణుక కుటుంబ సభ్యులతో మాట్లాడామని, రెండు, మూడు సార్లు డయల్100కు ఫిర్యాదు చేస్తే రక్షించామని చెప్పారు. చట్టప్రకారం చేయాల్సిన న్యాయం చేస్తామని తెలిపారు.