- కాంగ్రెస్ నేతపై మహిళ ఫిర్యాదు
- న్యాయం చేయకుంటే చావే గతి
నిజామాబాద్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించి 20 ఏండ్లు సహజీవనం చేసిన జిల్లా కిసాన్ కాంగ్రెస్ నేత ముప్ప గంగారెడ్డి ఇప్పుడు పట్టించుకోవడంలేదని, నిలదీస్తే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తమకు పుట్టిన కొడుకుకు 18 ఏండ్లు వచ్చాయని, అతని చదివించడానికి.. తనకు గుండె సంబంధ వ్యాధి ట్రీట్ మెంట్ కుడబ్బులు లేక అవస్థ పడుతున్నామని వాపోయారు.
సోమవారం కొడుకును వెంటబెట్టుకొని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతును కలువడానికి వచ్చిన ఆమె కలెక్టర్ లేకపోవడంతో ఏవో ప్రశాంత్కు కంప్లైంట్ ఇచ్చారు. ముప్పగంగారెడ్డికి అప్పటికే పెండ్లి అయినా తనను కూడా పెండ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆమె మీడియాకు చెప్పారు. పేదరికం వల్ల అతన్ని నమ్మి మోసపోయానన్నారు. తాను జబ్బు పడడంతో పట్టించుకోవడం మానేశాడని, ట్రీట్మెంట్ గురించి ప్రశ్నిస్తే బెదిరించాడని, పుట్టిన కొడుకుతో తనకు సంబంధంలేదని మోసం చేస్తున్నాడన్నారు.
ఇల్లు కట్టించాలని ఆరునెలల కింద అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినతర్వాత కట్టిస్తానని చెప్పాడని, ఇప్పుడు చేతులెత్తేశాడన్నారు. తన కొడుకు డీఎన్ఏ పరీక్ష చేయించి తాము గౌరవంగా బతికేలా చూడాలన్నారు. తనకు న్యాయం చేయకుంటే కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గంలేదన్నారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని ముప్పగంగారెడ్డి మీడియాతో అన్నారు.