-
పెట్రోల్ పోసి నిప్పంటించిన పాలోళ్లు
-
మెదక్ జిల్లా రామయంపేటలో ఘటన
రామాయంపేట/నిజాంపేట, వెలుగు: మంత్రాలు చేస్తున్నదన్న అనుమానంతో ఓ మహిళను కొందరు ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి దారుణంగా చితకబాదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో చోటు చేసుకున్నదని సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. కాట్రియాల గ్రామానికి చెందిన ద్యాగల ముత్తవ్వ (45) మంత్రాలు చేయడంతో తమతో పాటు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆమె పాలోళ్లు ఆరోపించారు. గురువారం రాత్రి వాళ్లంతా ముత్తవ్వ ఇంట్లో చొరబడి కట్టెలతో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆమెను బయటికి తీసుకొచ్చి వాకిట్లో పడేసి పెట్రోలు పోసి నిప్పంటించారు.
గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ముత్తవ్వను రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలి భర్త బాలయ్య ఫిర్యాదు మేరకు రామస్వామి, మురళీ, శేఖర్, లక్ష్మి, రాజ్యలత, మహాలక్ష్మి, పోచమ్మపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మూఢ నమ్మకాలతో దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి ఉన్నారు.