బాలుడిని సంచిలో మూటగట్టి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి స్థానికులకు దొరికిపోయింది ఓ మహిళ. ఈ ఘటన వరంగల్ నగరంలోని దేశాయిపేట్ డాక్టర్స్ కాలనీ2లో జరిగింది. బిట్టు అనే 4 సంవత్సరాల బాలుడిని మూతి చేతులు కట్టేసి, ముక్కు మూసి సంచిలో వేసుకుంది మహిళ. ఎవరికి ఇవ్వకుండా పారిపోతుండగా స్థానికులు గమనించి ఆ మహిళను పట్టుకుని బాలుడిని రక్షించారు. బాలుడు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
బాలుడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను స్థానిక మసీదులో బందించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ మతిస్థిమితం సరిగా ఉందా? లేక నిజంగా కిడ్నాప్ కు ప్రయత్నించిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.