న్యూ ఢిల్లీ: పెండ్లి పేరుతో ఓ మహిళ దశాబ్దకాలంలో ముగ్గురు బిజినెస్మెన్లకు కుచ్చుటోపీ పెట్టింది. పెండ్లి చేసుకొని కొద్దిరోజులు కాపురం చేసి.. ఆపై వారిపై కేసులు పెడుతూ.. నగదు, నగలతో పరారై.. ఇప్పటివరకూ రూ.1.35 కోట్లు దాకా కొల్లగొట్టింది. మూడో భర్త కుటుంబం ఫిర్యాదుతో పోలీసులకు చిక్కింది. ఉత్తరాఖండ్‌కు చెందిన నిక్కీ అలియాస్ సీమ 2013లో ఓ బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్నది. కొద్దిరోజుల తర్వాత అతడిపై కేసు పెట్టింది.
ఆపై రూ.75 లక్షలకు రాజీ కుదుర్చుకున్నది. 2017లో గురుగ్రామ్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ఇంజినీర్ను వివాహం చేసుకున్నది. కొద్ది రోజుల తర్వాత సెటిల్మెంట్కింద రూ.10 లక్షలు తీసుకొని, అతడినుంచి విడిపోయింది. 2023లో జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను మ్యారేజ్చేసుకున్నది. కొద్దిరోజులకే తన మూడో భర్త ఇంటినుంచి 36 లక్షల విలువైన నగలు, నగదుతో పరార్ అయ్యింది.
ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి, సీమను అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోని సైట్స్‌లో విడాకులు తీసుకున్న, భార్యలు చనిపోయినవారి వివరాలు సేకరించి సీమ వారికి మ్యారెజ్రిక్వెస్ట్ పంపేదని పోలీసులు విచారణ భాగంగా గుర్తించారు. ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని పెండ్లి చేసుకొని, వారి నుంచి రూ.1.35 కోట్లు లూటీ చేసినట్టు తేల్చారు.