ఆటోలో 9 తులాల బంగారం పోగొట్టుకున్న మహిళ

  •     మూడు గంటల్లో వెతికి పెట్టిన సుల్తానాబాద్ పోలీసులు 

సుల్తానాబాద్, వెలుగు:  సుల్తానాబాద్  ‌‌ ‌‌లో  ఓ  మహిళ తాను ప్రయాణిస్తున్న ఆటోలో  9 తులాల బంగారు ఆభరణాలను మరిచిపోగా..   కేవలం మూడు గంటల్లోనే వాటిని బాధితురాలికి పోలీసులు అప్పగించారు.  పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..  చొప్పదండి మండలం గుమ్లాపూర్  ‌‌ ‌‌  ‌‌ ‌‌ గ్రామానికి చెందిన మండల వసంత ఇటీవల సమ్మక్క, సారలమ్మ జాతర కోసం తల్లిగారి ఇల్లైన సుల్తానాబాద్  ‌‌ ‌‌ లోని సుగ్లాంపల్లె కు వచ్చింది.  

తిరిగి తన ఇంటికి వెళ్లేందుకు సుల్తానాబాద్  ‌‌ ‌‌లో ఆటో ఎక్కింది. బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయింది.  సుల్తానాబాద్  ‌‌ ‌‌  బస్టాండ్  ‌‌ ‌‌లో బస్సు ఎక్కే సమయంలో బంగారు ఆభరణాల బ్యాగు కనిపించకపోవడంతో ఆటో కోసం వెతికింది.  కానీ ఆటో ఎక్కడా కనిపించకపోవడంతో సుల్తానాబాద్  ‌‌ ‌‌ పట్టణ పోలీస్  ‌‌ ‌‌ స్టేషన్  ‌‌ ‌‌లో ఫిర్యాదు చేసింది.  సమాచారం అందుకున్న ఏసీపీ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ‌‌  

సీసీ కెమెరాల ఫుటేజీలను, ఫోన్ నంబర్లను సేకరించి దర్యాప్తులో వేగం పెంచారు.  చివరకు కరీంనగర్  ‌‌ ‌‌  ‌‌ ‌‌లోని కలెక్టరేట్ వద్ద సదరు ఆటోను చేజ్ చేసి ఆటోలో ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  సుమారు రూ. 6 లక్షల విలువ చేసే ఆభరణాలు పట్టుకున్నామని తెలిపారు.   సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వినీత, సిబ్బంది, అశోక్ తదితరులను ఏసీపీ అభినందించారు.